ఆయుష్షును ప్రసాదించే అభిషేకం
అలంకరణ వలన శ్రీమహావిష్ణువు మురిసిపోతాడు ... అభిషేకం వలన సదాశివుడు సంతోషిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆదిదేవుడికి ఆనందాన్ని కలిగించడమంటే, జన్మను సార్ధకం చేసుకోవడమేనని భావించాలి. వెనుక జన్మల నుంచి వెంటపడి వస్తోన్న పాపాల ఫలితాలను వదిలించేవాడు విశ్వనాథుడే. పుణ్యఫలితాలను అందించి పునీతులను చేసేవాడు ఆ ముక్తినాథుడే.
అలాంటి ఆ దేవదేవుడి మనసును గెలుచుకోవడానికి అభిషేకానికి మించిన మార్గంలేదు. అందువల్లనే ఆ స్వామిని అభిషేకించేందుకు భక్తులు అంతగా ఆరాటపడుతూ వుంటారు. సాధారణంగా శివాలయాలో నల్లరాయితోగానీ ... తెల్లరాయితో గాని చేయబడిన శివలింగాలు కనిపిస్తూ వుంటాయి. అనునిత్యం ఆ స్వామిని అభిషేకించుకోవడం కోసం ఆలయానికి వెళ్లే భక్తులు కొందరైతే, పూజామందిరంలోనే చిన్న శివలింగాన్ని ఏర్పాటుచేసుకుని ఆరాధించేవారు మరికొందరు.
ఈ క్రమంలో వివిధ రకాల లోహాలతో చేయాడిన శివలింగాలు కూడా కొంతమంది పూజామందిరాల్లో కనిపిస్తూ వుంటాయి. బంగారం ... వెండి ... రాగి ... ఇత్తడి ... కంచు వంటి లోహాలతో చేయబడిన శివలింగాల్లో, ఒక్కో లోహంతో చేయబడిన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ నేపథ్యంలో 'రాగి' తో తయారుచేయబడిన శివలింగాన్ని అనునిత్యం భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తూ వుండటం వలన 'ఆయుష్షు' పెరుగుతుందని చెప్పబడుతోంది.
సహజంగానే పూజ సంబంధమైన విషయాల్లో రాగి పాత్రల వాడకం ఎక్కువగా వుంటుంది. ప్రాచీనకాలం నుంచి ఈనాటి వరకూ, రాగితో చేసిన పాత్రలు ఉత్తమమైనవనే విశ్వాసం కనిపిస్తూ వుంటుంది. రాగి వాడకంలో ఆరోగ్యపరమైన విషయాలు దాగి ఉండటమే కారణమని చెబుతుంటారు. అలాంటి రాగితో చేయబడిన శివలింగాన్ని అనునిత్యం అభిషేకిస్తూ ఉండటం వలన ఆయుష్షు పెరుగుతుందని స్పష్టం చేయబడుతోంది.