భగవంతుడి సన్నిధిలో నిరీక్షణ కూడా వరమే !
మానవజన్మను ఇచ్చినందుకు ... మనిషిగా జీవించే అవకాశాన్ని కలిగించినందుకు ... సుఖసంతోషాలను అందిస్తూ ఉన్నందుకు ప్రతిఒక్కరూ ఆ భగవంతుడికి రుణపడి ఉండవలసిందే. అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ స్వామిని సేవించుకోవలసిందే. పుణ్యక్షేత్రమనగానే అక్కడి భగవంతుడితో పాటు భక్తజన సముద్రం కూడా కళ్లముందు కదలాడుతుంది.
తమలాగే అందరూ అనుకుని అక్కడికి బయలుదేరేవాళ్లు కొందరైతే, అక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా తెలిసిన వాళ్ల ద్వారా వెంటనే వెళ్లి వచ్చేయాలని మరికొందరు అనుకుంటూ వుంటారు. ఆ క్షేత్రంలో తెలిసినవాళ్లను పట్టుకుని సిఫార్సు ద్వారా, దగ్గరదారిలో దైవదర్శనం చేసుకుని బయటపడుతూ వుంటారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి దైవదర్శనం చేయించడానికి ఇలా వెళ్లడం సరైనదిగా అనిపించవచ్చునుగానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సిఫార్సుల గురించిన ఆలోచన చేయకూడదు.
తమకన్నా ఎక్కువ ఇబ్బందులుపడుతూ ... తమకన్నా ఎక్కువ దూరం నుంచి వస్తోన్న భక్తులను చూసి, వాళ్లముందు తాము పడేది కష్టమే కాదనుకోవాలి. అయినా అన్నికష్టాలను తీర్చే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లడంలోను కష్టం ఉండకూడదనుకోవడం విచారించదగిన విషయం. భగవంతుడి ప్రత్యేక దర్శనం వలన ... ఇతరులకి దక్కని భాగ్యం తమకి దక్కిందని అనుకోకూడదు. తాము ప్రత్యేకమనే భావన కలగకూడదు. అలాంటివారు దైవదర్శనం వెంటనే చేసుకుని బయటికి వచ్చినా, ఏదో ఒకచోట అంత సమయమూ నిరీక్షించవలసిన పరిస్థితి ఎదురవుతుంది.
భక్తులందరితో కలిసి కదులుతూ 'గోవిందా' అని ... 'మల్లన్నా' అని ఎలుగెత్తి పిలవడంలోని ఆనందం, కేవలం కుటుంబంతో కలిసి దగ్గరి దారిలో వెళ్లిరావడం వలన కలగదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫరవాలేదు ... స్వామి దర్శనం చేసుకుని రావలసిందే అనే బలమైన సంకల్పంతో బయలుదేరితే, ఇట్టే దర్శన భాగ్యాన్ని ప్రసాదించి ఆయన తన మహిమను చూపుతుంటాడు. భగవంతుడిని దర్శించాలనే ఆరాటం భక్తులలో ఎంతగా వుంటుందో, ఆ భక్తులను చూడటం కోసం స్వామి కూడా అంతకన్నా ఎక్కువగా ఆతృత పడుతుంటాడు.
ఈ ఒక్క ఆలోచన ... అనుభూతి చాలు ఎంతదూరమైనా ప్రయాణం చేయడానికి, ఎంతసేపైనా ఆ స్వామి దర్శన భాగ్యం కోసం నిరీక్షించడానికి. అందుకే భగవంతుడి దృష్టిలో అంతా సమానమేనని భావించాలి. తమకి ఎంతసేపటిలో దర్శనభాగ్యం కల్పించాలనేది ఆయన అనుగ్రహంపై ఆధారపడి ఉంటుందని విశ్వసించాలి. సాధ్యమైనంత వరకూ సిఫార్సుల జోలికి పోకుండా సంతోషంగా దైవదర్శనం చేసుకుంటూ వుండాలి. భగవంతుడి వాకిట నిరీక్షణ కూడా వరమేనని భావించాలి ... అంతసేపు ఆయన వాకిట నిలిచే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి.