ఇది మహిమగల బావి అట !
సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడి తీర్థాలలో ముందుగా స్నానమాచరించి, ఆ తరువాత దైవదర్శనం చేసుకోవడం జరుగుతూ వుంటుంది. భగవంతుడి సంకల్పం మేరకు ఏర్పడినట్టుగా చెప్పబడుతోన్న ఈ తీర్థాలు, ఆ పుణ్యక్షేత్రాలకిగల విశిష్టతను చాటడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి.
కొన్ని తీర్థాలలో స్నానమాచరించే అవకాశం ఉంటుంది. మరికొన్ని తీర్థాలలో అందులోని నీళ్లు తలపై చల్లుకోవడం వరకే అవకాశం వుంటుంది. ఇక కొన్ని తీర్థాలలోని నీటిని ఆలయంలో తీర్థంగా ఇస్తుంటారు. తీర్థాన్ని స్పర్శించినా ... స్వీకరించినా అది శరీరాన్నీ ... మనసునీ ... జీవితాన్నికూడా పవిత్రం చేస్తుంది. కొన్ని తీర్థాలు అక్కడి ప్రధానదైవం సంకల్పం కారణంగా ఏర్పడగా, మరికొన్ని తీర్థాలు మహర్షుల సంకల్పం వలన ఏర్పడినట్టు స్థలపురాణం చెబుతూ వుంటుంది.
అలాంటి క్షేత్రాల్లో గుంటూరు సమీపంలో గల 'పెదకాకాని' ఒకటిగా చెప్పబడుతోంది. మహాదేవుడు 'మల్లేశ్వరుడు' పేరుతో ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. 'భరద్వాజ మహర్షి' తవ్విన బావి ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఆ మహర్షి సంకల్పం వలన అనేక పుణ్యతీర్థాలలోని నీరు ఈ బావిలోకి వచ్చి చేరుతుందని చెబుతుంటారు. ఈ బావిలోని నీరు ఎండిపోవడంగానీ ... స్వచ్ఛత తగ్గడంగాని ఇంతవరకూ జరగలేదు.
ఈ బావిలోని నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనారోగ్యాలు దూరమవుతాయని అంటారు. తలపై చల్లుకోవడం వలన అనేక పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందనీ, పాపాలు ... దోషాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణపరమైన నేపథ్యంతో పాటు చారిత్రక వైభవం కలిగిన ఈ ప్రాచీన క్షేత్రంలో, మల్లేశ్వరుడి లీలావిశేషాలు ఇక్కడ కథలుకథలుగా వినిపిస్తూ వుంటాయి. అందువలన ఇక్కడి బావిలోని నీరు దివ్యతీర్థమనీ, ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.