మనసును మంత్రించే మహాశివుడి క్షేత్రం

సదాశివుడిని బ్రహ్మ - విష్ణువులు పూజిస్తూ ఉంటారు ... సూర్యచంద్రులు ఆరాధిస్తూ ఉంటారు. అష్టదిక్పాలకులు ఆయన సేవలో తరిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా సూర్యుడు ... చంద్రుడు ... ఇంద్రుడు .. యముడు .. ఇలా ఆ స్వామిని ప్రతిష్ఠించి పూజించారని చెప్పే పుణ్యక్షేత్రాలు ఎన్నో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటాయి.

సూర్యభగవానుడు ప్రతిష్ఠించినవిగా ... ఆయన కిరణాలతో అర్చించేవిగా చెప్పబడుతోన్న క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఇక నాగులకు .. శివుడికిగల అనుబంధం కూడా ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. ఆదిదేవుడి ఆభరణాలుగా నాగులే కనిపిస్తూ వుంటాయి. కొన్ని క్షేత్రాల్లో ఆయన నాగేశ్వరుడుగా కూడా కొలవబడుతూ వుంటాడు. అలాంటి క్షేత్రాల్లో నాగుల గురించిన విశేషాలు వినిపిస్తుంటాయి.

అలా అటు సూర్యభగవానుడిచే కిరణాల హారతిని అందుకుంటూ, ఇటు నాగసర్పంచే ఆరాధించబడుతోన్న క్షేత్రంగా 'సంగమేశ్వర ఆలయం' కనిపిస్తూ వుంటుంది. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రాచీనమైన ఈ క్షేత్రం ఆనందాన్నీ ... ఆశ్చర్యాన్నీ ... ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని అందిస్తుంది. పరమశివుడి లీలావిశేషాలకు ఇది నిలయంగా కనిపిస్తుంది.

అప్పుడప్పుడు ఒక మహాసర్పం గర్భాలయంలోకి వచ్చి శివలింగానికి చుట్టుకుని కాసేపు వుండి వెళ్లిపోతుందట. ఇక మహాశివరాత్రి నుంచి కొన్ని రోజులపాటు సూర్యకిరణాలు ఇక్కడి శివలింగంపై పడుతూ ఉంటాయి. అలా సూర్యభగవానుడిచేత ... నాగదేవత చేత ఇప్పటికీ ఆరాధించబడుతోన్న ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని అంటారు. ఇక్కడి స్వామి దర్శనం వలన గ్రహసంబంధమైన దోషాలు ... నాగదోషాలు తొలగిపోతాయని చెబుతారు.


More Bhakti News