ఫాల్గుణమాసంలో విష్ణు ఆరాధనా ఫలితం !

చాంద్రమానం ప్రకారం వచ్చే మాసాలలో 'ఫాల్గుణమాసం' చివరిదిగా చెప్పబడుతోంది. ఇది జగాలనేలే జగన్నాథుడికి అత్యంత ఇష్టమైన మాసం. అందువలన ఈ మాసంలో శ్రీమన్నారాయణుడిని సదా స్మరిస్తూ ... సేవిస్తూ వుండాలి. వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శిస్తూ ... పూజిస్తూ వుండాలి.

పాలకడలిలో వుండే శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు గోపాలకుడిగా ఆవులపట్ల తనకిగల ప్రేమానురాగాలను చాటుకున్నాడు. ఆవులకు రక్షకుడిగా ఉంటూ .. వాటి మధురమైన పాలను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. అందుకే కృష్ణుడి నైవేద్యాలలో ఆవుపాలు ప్రధానంగా కనిపిస్తూ వుంటాయి.

ఇక శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని వెదకుతూ ఈ భూమి మీదకి శ్రీనివాసుడుగా వచ్చాడు. ఆ సమయంలో ఒక పుట్టలో సేదదీరిన స్వామి ఆవుపాలను ఆహారంగా స్వీకరించాడు. ఇప్పటికీ తిరుమల శ్రీనివాసుడు ప్రతిరోజూ ఉదయాన్నే ఆవుపాలు - వెన్న నైవేద్యంగా స్వీకరిస్తూ వుంటాడు. దీనిని బట్టి శ్రీమన్నారాయణుడికి గోవులన్నా .. వాటిపాలన్నా ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

అందువలన ఆ స్వామికి ప్రీతికరమైన ఈ మాసంలో అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహించి ఆవుపాలను నైవేద్యంగా అందించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాసంలో 'గోవు'ను దానంగా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయి. సకలదేవతా స్వరూపంగా గోవు ... అత్యంత పవిత్రమైనవిగా దాని పాలు విశిష్టమైన స్థానంలో కనిపిస్తాయి.

శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో ఆయనకి ఇష్టమైన ఆవుపాలను నైవేద్యంగా సమర్పించడం వలన ఉత్తమమైన జీవితం లభిస్తుంది ... ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. ఇక ఆ స్వామికి ఇష్టమైన గోవును బ్రాహ్మణులకు దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News