ధర్మాన్ని రక్షిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు
కౌరవులు తమ ఒక్కగానొక్క సోదరి అయిన 'దుశ్శల' వివాహాన్ని 'సైంధవుడు'తో జరిపిస్తారు. పాండవులు అరణ్యవాసం చేస్తోన్న సమయంలో సైంధవుడు అటుగా వస్తాడు. ఆ సమయంలో అక్కడి కుటీరంలో ద్రౌపది ఒక్కతి మాత్రమే వుంటుంది. అదే సరైన సమయంగా భావించిన సైంధవుడు, ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు.
తన పాతివ్రత్యాన్ని గురించీ ... తన భర్తల శౌర్యపరాక్రమాల గురించి ద్రౌపది ఎంతగా చెప్పినా అతను వినిపించుకోకుండా ఆమెని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే మహాబల సంపన్నుడైన భీమసేనుడు అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ద్రౌపది విషయంలో అతని ధోరణిపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ సంహరించబోతాడు.
చివరి నిముషంలో ధర్మరాజు అడ్డుపడతాడు. సైంధవుడి భార్య అయిన దుశ్శల తమకి కూడా సోదరి అనే విషయాన్ని భీముడికి గుర్తుచేస్తాడు. దుశ్శల పసుపు కుంకుమలను కాపాడవలసిన బాధ్యత తమపై కూడా వుందని చెబుతాడు. తమ కారణంగా దుశ్శల కన్నీళ్లు పెట్టకూడదనీ, సైంధవుడిని క్షమించి వదిలివేయడమే మంచిదని అంటాడు. ధర్మరాజు హితవాక్యల కారణంగా భీముడి ఆవేశం చల్లారుతుంది. దాంతో పాపానికి పాల్పడిన సైంధవుడికి జుట్టు తీయించి ప్రాణాలతో వదిలిపెడతాడు.
అలా ధర్మరాజు క్షమాభిక్ష కారణంగా సైంధవుడు బతికి బయటపడతాడు. అయితే ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న సైంధవుడు, యుద్ధరంగంలో అభిమన్యుడు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యకారకుడు అవుతాడు. అలాంటివాడిని రెండవసారి మన్నించడం మంచికాదని భావించిన అర్జునుడు .. సైంధవుడి శిరస్సును ఖండిస్తాడు. ఈ విషయంలోను అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలుస్తాడు. ధర్మపరులైన పాండవులకి విజయం చేకూరేలా చేస్తాడు.