భక్తుల నుంచి బాబా ఆశించేది అదే !
శిరిడీ వెళ్లిన భక్తులు బాబా ఇక్కడ తిరిగాడు ... అక్కడ కూర్చున్నాడు ... ఆయన మొక్కలకి నీళ్లు పోసింది ఇక్కడే ... భిక్ష చేసిన ప్రదేశం ఇదే .. అంటూ ఆయన గురించి అపురూపంగా చెప్పుకుంటూ వుంటారు. ఆ ప్రదేశాలను స్పర్శించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతుంటారు.
బాబా ఎప్పుడూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. తన గురించి ప్రచారం చేసే బృందాలను తయారుచేయలేదు. అయినా ఈ రోజున లక్షలాదిగా భక్తులు శిరిడీని దర్శిస్తూ వస్తున్నారు. అలా తరలివచ్చే భక్తజన ప్రవాహాన్ని చూసినప్పుడు, అయిదు ఇళ్లలో భిక్షచేసిన బాబా ఇంతమంది ప్రజలను ఎలా ప్రభావితం చేయగలిగాడు అనే ఆశ్చర్యం కలగకమానదు. ఏ శక్తి వాళ్లని శిరిడీ వరకూ రప్పించగలిగింది అనే ఆలోచన రాక మానదు.
అప్పుడు అక్కడ భక్తులను పలకరిస్తే వారి అనుభవాలు బాబా మహిమలుగా వెలుగుచూస్తాయి. వారి మాటల్లో బాబాపట్ల గల అపారమైన విశ్వాసం కనిపిస్తుంది. ఆ విశ్వాసమే వాళ్లని అంతదూరం తీసుకువచ్చిందనే విషయం స్పష్టమవుతుంది. బాబా జీవితాన్ని గురించి కొంతవరకు తెలుసుకున్న వారికెవరికైనా, ఆయన విశ్వాసానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాడనే విషయం అర్థమవుతుంది.
మనసులో ఏదో మూల సంశయం పెట్టుకుని వచ్చినవారిని ఆయన మశీదు మెట్లు కూడా ఎక్కనిచ్చేవాడు కాదు. తమ అజ్ఞానాన్ని మన్నించమని వాళ్లు కోరగానే ఆ క్షణమే ఆయన వెన్నలా కరిగిపోయి ఆదరించేవాడు. కేవలం కోరికలను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే అంతా బాబాను ఆశ్రయిస్తున్నారని ఒకసారి 'నానావలి' ఆయన దగ్గర అసహనాన్ని ప్రదర్శిస్తాడు.
ఎవరి పరిణతిని బట్టి వారి కోరికలు ఉంటాయనీ, అవి ధర్మబద్ధమైనవే అయితే ఆ భగవంతుడు వాటిని తప్పక ఆమోదిస్తాడని బాబా సెలవిస్తాడు. గురువు దగ్గరికి వెళ్లినా ... భగవంతుడి దర్శనానికి వెళ్లినా ఉండవలసింది బలమైన విశ్వాసమని చెబుతాడు. ఎవరి విశ్వాసానికి తగిన ఫలితం వాళ్లకి తప్పక లభిస్తుందని అంటాడు. ఆ విశ్వాసం ఉంచలేనివాళ్లు పూత రాలిపోయిన విధంగా, మధ్యలోనే జారిపోతారని స్పష్టం చేస్తాడు.