భక్తులను వదలి ఉండలేని భగవంతుడు
భక్తులను భగవంతుడు ఎప్పుడూ కనిపెట్టుకునే వుంటాడు. భక్తులతో ఉండటమే ఆయనకి ఆనందం ... వాళ్ల బాధలను తీరుస్తూ బాధ్యతలను మోయడంలోనే ఆయనకి సంతోషం. తన భక్తుల నుంచి తనని దూరం చేయడానికి ఎవరు ప్రయత్నించినా ఆయన ఎంతమాత్రం సహించడు. తనకీ తన భక్తులకు మధ్యగల అవాంతరాలను అవలీలగా తొలగిస్తూనే వుంటాడు.
ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ వుంటాయి. శ్రీరాముడికి మహాభక్తుడైన త్యాగయ్య .. తన పూజామందిరంలో గల రాముడి విగ్రహాన్ని ఎంతగానో ఆరాధించేవాడు. ఆ రాముడిని కీర్తించడంతోనే ఆయనకి రోజులు గడచిపోతూ ఉండేవి. త్యాగయ్యపై గల కోపంతో ఆయన సోదరుడు ఆ రాముడి విగ్రహాన్ని కావేరీనదిలో పారవేస్తాడు.
తన రాముడు తనని విడచి వెళ్లిపోయాడని త్యాగయ్య ఎంతగా బాధపడతాడో, అంతకన్నా ఎక్కువగా రాముడు ఆయనని విడిచి వుండలేక పోయివుంటాడు. అందుకే కావేరీ నది పొంగడం ... అందులోని రాముడి విగ్రహం త్యాగయ్య దగ్గరికి కొట్టుకురావడం జరుగుతుంది. ఇక సక్కుబాయి విషయానికి వస్తే ఆమె పాండురంగడికి మహాభక్తురాలు. తన దగ్గర గల కృష్ణుడి విగ్రహాన్ని వదలి ఆమె క్షణమైనా వుండేది కాదు.
అది సహించని ఆమె అత్తగారు ఆ విగ్రహాన్ని అవతల పారేస్తుంది. ఆ విగ్రహం ముక్కలైపోవడం చూసిన సక్కుబాయి కుప్పకూలిపోతుంది. ఆమె బాధను చూడలేకపోయిన పాండురంగడు, ఆ విగ్రహాన్ని యధాతథంగా సక్కుబాయి ముందుంచుతాడు. ఆ విగ్రహాన్ని హృదయానికి హత్తుకున్న ఆమె సంతోషంతో తనని తాను మరిచిపోతుంది. ఇక మహాభక్తుడైన తుకారామ్ విషయంలోనూ ఇలాంటి సంఘటన కనిపిస్తుంది.
తుకారామ్ అనునిత్యం దర్శించుకునే పాండురంగడి ఆలయంలోని విగ్రహాన్ని కొంతమంది కుట్రదారులు దొంగిలించి పాడుబడిన బావిలో పడేస్తారు. తుకారామ్ నిజమైన భక్తుడు కాకపోవడమే అందుకు కారణమనే నిందవేసి ఆయనని ఆ ఊరు నుంచి పంపించి వేయడానికి ప్రయత్నిస్తారు. భక్తుడికి దూరంగా ఉండలేని భగవంతుడు బావిలో నుంచి తిరిగివస్తాడు. ఇలా తననీ ... తన భక్తులను దూరం చేయడం ఎవరివలన కాదనే విషయాన్ని ఆ భగవంతుడు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వున్నాడు. భక్తులకు తన హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని కల్పిస్తూనే వున్నాడు.