భగవంతుడి సాయం ఎలాగైనా అందుతుంది !

కొంతమంది అనునిత్యం ఆ భగవంతుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. అలా భగవంతుడికి దగ్గరైనవాళ్లలో సహజంగానే కఠినత్వం కరిగిపోతూ వుంటుంది. అందువలన ఇతరులు కష్టాల్లో వున్నప్పుడు ... ఆపదలో పడినప్పుడు చూసి తట్టుకోలేకపోతుంటారు. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా చేతనైన సాయం చేస్తుంటారు. ఇలా ఇటు మానవత్వాన్నీ ... అటు భక్తితత్వాన్ని ఆవిష్కరిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు.

అలా అందరి మంచిని గురించి ఆలోచించేవాళ్లు కూడా ఏదో ఒక సందర్భంలో ఆపదలో పడుతుండటం జరుగుతూ వుంటుంది. అలాంటి పరిస్థితుల్లో తాము బాగా విశ్వసించినవాళ్లు ఆదుకోవడానికి రాకపోవడం ఆశ్చర్యాన్నీ ... ఆవేదనను కలిగిస్తుంది. ఆశించినవాళ్లు సమయానికి సహకరించకపోవడంతో సహజంగానే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అతికష్టం మీద ఆ గండం నుంచి గట్టెక్కిన తరువాత వాళ్లు తేలికగా ఊపిరి పీల్చుకుంటారు.

అయితే .. తాము ఎంతమందికి సాయం చేసినా తమకి ఒక్కరూ సహకరించలేదనే బాధమాత్రం వాళ్లని వెంటాడుతూ వుంటుంది. అలాగే ఇంతగా ఆ భగవంతుడిని పూజిస్తే ఆయన ప్రతిఫలంగా ఇచ్చినది ఇదేనా ? అనే నిరాశా నిస్పృహలు కూడా కలుగుతూ వుంటాయి. దాంతో ఇక మీదట ఎవరికీ ఎలాంటి సాయం చేయకూడదనీ, భగవంతుడికి నమస్కరించకూడదని కొంతమంది నిర్ణయాలు తీసేసుకుంటూ వుంటారు.

ఆందోళనపడినా ఆ గండం నుంచి బయటపడటానికి కారకుడు ఆ భగవంతుడేననీ, తనకి చేసిన సేవలకు ప్రతిఫలంగానే ఆయన అనుగ్రహించాడనే విషయాన్ని ఈ సమయంలో మరచిపోవడం జరుగుతూ వుంటుంది. ఫలానా వాళ్లు మాత్రమే తమకి దగ్గరవాళ్లనీ ... కష్టనష్టాల్లో తమని వాళ్లు తప్పకుండా ఆదుకుంటారని విశ్వసించి, అది నిజం కాదని తెలిసిన రోజున ఇలా అసహనానికి లోనవడం సహజంగా జరుగుతూ వుంటుంది.

కానీ అప్పటివరకూ ఇతరులకు చేస్తూ వచ్చిన సేవ ఊరికేపోదు. అయినవాళ్లంతా ముఖం చాటేసిన సందర్భాల్లో అసలు పరిచయమే లేని వ్యక్తులు తారసపడి ఆపదలో అండగానిలిచిన సందర్భాలు లేకపోలేదు. అప్పటివరకూ ఇతరుల పట్ల చూపిన మానవత్వం ... మంచితనమే ఇందుకు కారణం. ఇతరులకు సాయపడితే, భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి తమకి సాయపడతాడనే విశ్వాసానికి ఇది నిదర్శనం. అందుకే మంచితనాన్నీ ... మానవత్వాన్ని ఎప్పుడూ విడిచి పెట్టకూడదు. ఇవి భగవంతుడి రక్షణలో ... ఆయన పర్యవేక్షణలో ఉంచుతాయనే విషయాన్ని మరచిపోకూడదు.


More Bhakti News