ఇలా సదాశివుడు సంతోషిస్తాడు

అనంతమైన ఈ విశ్వంలో ప్రతి జీవికి ఆహారాన్ని అందించేవాడు ... ఆయురారోగ్యాలతో కూడిన ఆనందాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడే. అందరూ ఆయన కరుణాకటాక్షాలపై ఆధారపడినవాళ్లే. ఆయన అనుగ్రహంతో జీవితాన్ని కొనసాగిస్తోన్నవాళ్లే. అందుకే సర్వానికి యజమాని సదాశివుడే అనే ఆలోచనను కలిగి వుండాలి. ఆయన సేవ చేసుకునే భాగ్యానికి ఆరాటపడుతూ వుండాలి.

అయితే తెలిసో తెలియకో చేసిన పాపాలు వెంటాడుతూ వుంటాయి. పరమశివుడి పాదాలవైపు దృష్టి పోకుండా అడ్డుపడుతూ వుంటాయి. అలాంటి ఆటంకాలు దాటుకుని ఎవరైతే ఆదిదేవుడిని గురించిన ఆలోచన చేస్తారో, అప్పుడే వాళ్ల పాపాలు పటాపంచలవుతాయి. ఆ దేవదేవుడి దర్శనమాత్రం చేతనే దోషాలు దూరమవుతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, అలాంటివారి పాపాలు .. గంగా ప్రవాహంలో కొట్టుకుపోయే మాలిన్యంలా కొట్టుకుపోతాయి.

ఇక మహాశివరాత్రి రోజున ఆ స్వామిని అర్చించిన వాళ్లు మరునాటి అమావాస్య రోజున దానధర్మాలు చేయాలి. అన్నదానం .. వస్త్రదానం ... గోదానం .. ఇలా స్తోమతను బట్టి దక్షిణ తాంబూలాలతో సహా చేయాలి. దానం ఏదైనా అది మనస్పూర్తిగా ... శ్రద్ధగా చేయాలి. దానం స్వీకరించే వారిపట్ల తక్కువ భావన ఎంతమాత్రం కలగకూడదు. తన ద్వారా ఆ పరమేశ్వరుడు వాటిని ఇతరులకి ఇప్పిస్తున్నాడనే భావన మాత్రమే వుండాలి.

అలా తాను నిమిత్త మాత్రుడనని తలుస్తూ ... సర్వానికి యజమాని సదాశివుడని విశ్వసిస్తూ ఈ రోజున దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి సంతోషిస్తాడనీ, సకల శుభాలను ... ఉత్తమగతులను కల్పిస్తాడని చెప్పబడుతోంది.


More Bhakti News