ఇక్కడి శివుడికి పుష్పార్చన ఇష్టమట !
శివుడు కొలువైన చోట ... శివనామం వినిపించే చోట కష్టాలు కనిపించవు ... పాపాలు దరిచేరవు. తన భక్తులు తనని చేరుకోవడానికిగాను ఎన్నో అవకాశాలు ... మరెన్నో మార్గాలను మహాదేవుడు కల్పించాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్వామి అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు. అలా ఆ ఉమామహేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 'మార్కొంపాడు' విలసిల్లుతోంది. ఇక్కడి సదాశివుడు 'మార్కండేయస్వామి' గా కొలవబడుతుంటాడు.
సాధారణంగా ఏదైనా ఒక శైవ క్షేత్రానికి వెళ్లినప్పుడు అది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగమనీ .. దేవతలు ప్రతిష్ఠించినదనీ .. మహర్షులు ప్రతిష్ఠించినదని తెలిసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. మృత్యువును జయించిన 'మార్కండేయుడు' పూజించిన శివలింగాన్ని దర్శించినా అలాంటి అనుభూతే కలుగుతుంది. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను శంకరుడు మృత్యువు నుంచి తప్పిస్తాడు అనడానికి నిదర్శనంగా మార్కండేయుడి జీవితంలో జరిగిన సంఘటన కనిపిస్తూ వుంటుంది.
అలాంటి మార్కండేయుడిచే పూజలు అందుకున్న ఇక్కడి శివయ్యకి బిల్వార్చనలు ... పుష్పార్చనలు సమానంగా జరుగుతూ వుంటాయి. సాధారణంగా శివుడి పూజాభిషేకాల్లో బిల్వపత్రాలు విశిష్టమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇక ఇక్కడి శివుడికి బిల్వదళాలతో పాటు పుష్పార్చన ఎంతో ఇష్టమని చెబుతుంటారు. విశేషమైన మాసాల్లోను ... పర్వదినాల్లోను ఇక్కడి స్వామిని వివిధరకాల పూలతో అర్చిస్తుంటారు.
శైవక్షేత్రాల్లో వివిధరకాల మొక్కుబడులు చెల్లించడం జరుగుతూ వుంటుంది. ఈ క్షేత్రంలో 'లక్ష బిల్వార్చన' ... 'లక్ష పుష్పార్చన'లు జరిపించడం ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. ఆ స్వామి అనుగ్రహాన్ని ఆశించి వీటిని జరిపించేవారు ... ఆయన కటాక్షాన్ని పొందిన కారణంగా జరిపించేవారు ఇక్కడ పెద్దసంఖ్యలో కనిపిస్తుంటారు. మహర్షులు తిరుగాడినది ... మహాదేవుడికి ఇష్టమైనది అయిన ఈ ప్రదేశం మహిమాన్వితమైనదని భక్తులు చెబుతుంటారు. ఆ పరమేశ్వరుడికి బిల్వార్చన ... పుష్పార్చన జరిపించడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని అంటారు.