కోరినవరాలనిచ్చే కొండంత శివుడు
కోరినవరాలనిచ్చే కొండంత దేవుడు శివుడు. ఆకలిని తీర్చేది ... ఆవేదనలో నుంచి బయటపడేసేది ఆయనే. అమ్మవారు ప్రకృతిమాత కనుక, ఆమె సన్నిధిలా కనిపించే కొండకోనల్లో ... నదీతీరాల్లో ... జలపాతాల అంచులలో ... గుహలలో స్వామి ఆవిర్భవిస్తూ వుంటాడు. తనని అనుగ్రహించేవారికి ఏది కావాలో దానినే అనుగ్రహిస్తూ వుంటాడు.
ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... మోక్షం .. ఇలా ఎవరు దేనియందు అనురక్తులై వుంటారో వాళ్లకి దానిని ఆనందంగా అందిస్తూ వుంటాడు. అందుకే భక్తులు ఆయనని శివయ్యా ... మల్లన్నా అని ఆప్యాయంగా పిలుచుకుంటూ వుంటారు. అంకితభావంతో కొలుస్తూ వుంటారు. అందువల్లనే ఆ స్వామి ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి.
అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో 'పిల్లలమర్రి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా సూర్యాపేటమండలం పరిధిలో గల ఈ క్షేత్రంలో పరమశివుడు ఒకే ప్రాంగణంలోగల మూడు ఆలయాలలో దర్శనమిస్తూ వుంటాడు. 'ఎర్రకేశ్వరుడు' ... 'రామేశ్వరుడు' ... 'త్రికూటేశ్వరుడు' పేర్లతో స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. మూడు ఆలయాలలో ... మూడు పేర్లతో భక్తులను ముక్కంటి అనుగ్రహిస్తూ వుండటం ఇక్కడి విశేషం.
మహాశివరాత్రి పర్వదినం రోజున ... ఆ మరునాటి అమావాస్య రోజున పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఆదిదేవుడి అనుగ్రహాన్ని కోరుతుంటారు. ఈ క్షేత్రంలో అడుగుమోపిన మరుక్షణమే పాపాలు నశిస్తాయని స్థలపురాణం చెబుతోంది. ప్రాచీనకాలం నాటి ఈ ఆలయం సదాశివుడి లీలావిశేషాలకు ... మహిమలకు నెలవుగా కనిపిస్తూ వుంటుంది. భక్తులు స్వామివారిని కొండంత అండగా భావిస్తూ వుంటారు. కష్టాల్లో కరుణించేది ... ఆపదలో ఆదుకునేది అ దేవదేవుడేనని విశ్వసిస్తుంటారు.