మహాదేవుడి ప్రతి క్షేత్రం మహిమాన్వితమే

శివుడు కొలువైన ఏ క్షేత్రానికి వెళ్లినా గర్భాలయంలో స్వామి స్వరూపంగా చెప్పబడుతోన్న శివలింగం దర్శనమిస్తుంది. అది ఒక రాయిగా కాకుండా సాక్షాత్తు శివుడే ఎదురుగా ఆశీనుడైన భావన కలిగిస్తుంది. సదాశివుడి సన్నిధిలో వున్నామనే ఆ అనుభూతే హాయిగా అనిపిస్తుంది. తమలో ఎవరు గొప్ప? అనే విషయాన్ని గురించి వాదులాడుకున్న బ్రహ్మ - విష్ణువులు, తమ ఇద్దరికంటే శంకరుడే గొప్పవాడని అంగీకరించి ఆయన ధరించిన లింగరూపాన్ని పూజించారు.

ఇక రాముడు ... పరశురాముడు వంటివారు ఆ సదాశివుడిని సేవించారు. లోకానికి వెలుగు .. వెన్నెల పంచే సూర్యచంద్రులు సైతం ఆ దేవదేవుడిని ఆరాధించి శాపాల నుంచి బయటపడినవాళ్లే. ఇంద్రాది దేవతలు ... నాగదేవతలు ఆయన సేవలో తరించినవాళ్లే. అలాంటి పరమేశ్వరుడు ఆవిర్భవించిన ప్రతి క్షేత్రం ఏదో ఒక ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

ఆదిదేవుడి ప్రతి క్షేత్రం ఆయన లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూనే ఉంటుంది. ఒక క్షేత్రంలో శివలింగం జీవం వున్న చెట్టులా పెరుగుతూ వుంటుంది. మరో క్షేత్రంలో అమావాస్య - పౌర్ణమి రోజులను బట్టి రంగులు మారుతూ వుంటుంది. ఒక క్షేత్రంలో శివలింగం శిరస్సుభాగం నుంచి 'గంగ' పొంగుతూ వుంటుంది. ఇంకొక క్షేత్రంలో శివలింగం పాదభాగం నుంచి నీరు ఊరుతూ వుంటుంది. ఒకచోట అర్థనారీశ్వరుడుగా ... మరోచోట కొప్పులింగేశ్వరుడుగా దర్శనమిస్తూ వుంటాడు.

ఒక శివలింగంపై ఆవుపాద ముద్ర .. మరో శివలింగంపై పావురాల ముద్ర ... ఇంకో శివలింగంపై మహర్షి చేతివ్రేళ్ల ముద్రలతో కొన్ని క్షేత్రాల్లో దర్శనమిస్తుంటాడు. అందుకు కారణమైన శివలీలలు ఆయా క్షేత్రాల్లో కమనీయంగా ఆవిష్కరించబడుతూ వుంటాయి. ఇలా మహేశ్వరుడు ప్రతి క్షేత్రంలోను తన మహిమలను చాటుతూనే వుంటాడు. సాలె పురుగు నుంచి ఏనుగు వరకూ, బాల భక్తుల నుంచి మహర్షుల వరకూ అన్నింటినీ ... అందరినీ ప్రేమతత్త్వంతో ఆదరిస్తూనే వుంటాడు .. అనుగ్రహిస్తూనే వుంటాడు.

దయ చూపించేది ... దారిచూపించేది ... భుక్తిని ఇచ్చేది ... ముక్తిని ప్రసాదించేది ఆ విశ్వనాథుడే. అందుకే మహాశివరాత్రి రోజున ఆ మహాదేవుడి క్షేత్రాలను కనులారా దర్శించాలి. ఆ స్వామి పాదాల చెంత మనసునే పుష్పంగా సమర్పించాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ తరించాలి.


More Bhakti News