శివపార్వతుల కల్యాణోత్సవ దర్శన ఫలితం

ఆలుమగలు అనే మాట వినగానే ఎవరి కంటిముందైనా శివపార్వతులే మెదులుతారు. అనురాగానికీ ... ఆప్యాయతకి శివపార్వతులు ప్రతీకలు. ఆయన సదాశివుడు ... ఆమె సర్వమంగళ. ఆ ఇద్దరూ లోకాలకి తల్లిదండ్రులు. సమస్తజీవులకు ఆహారాన్ని అందించేవాడయిన విశ్వేశ్వరుడికి విసుగనేది తెలియదు. అందరినీ కనిపెట్టుకునే అమ్మవారికి అసహనము తెలియదు.

లోకకల్యాణం కోసం శివుడు తీసుకున్న ప్రతినిర్ణయానికి అమ్మవారు తన సహకారాన్ని అందించింది. క్షీరసాగర మథన సమయంలో ఆయన కాలకూటవిషం తాగే సమయంలోను అమ్మవారు అడ్డు చెప్పలేదు. లోకకల్యాణం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లోను వికటించదనే విశ్వాసం ... తన మాంగల్యంపై తనకి గల అపారమైన నమ్మకం ఆమెకి ఆందోళన కలిగించకుండా చేశాయి. అలాంటి పార్వతీదేవి ఎడబాటుని క్షణమైనా తట్టుకోలేడు కనుకనే పరమశివుడు ఆమెకి తన శరీరంలో అర్థభాగమిచ్చాడు.

ఆపదలోను ... ఆనందంలోనూ కలిసి నడచిన కారణంగానే పార్వతీపరమేశ్వరులు ఆదర్శదంపతులుగా ... ఆదిదంపతులుగా పూజించబడుతున్నారు. అలాంటి దంపతులకు అంగరంగవైభవంగా కల్యానోత్సవాన్ని జరిపించి భక్తులు తమ ముచ్చటతీర్చుకుంటూ వుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలా శైవక్షేత్రాల్లో స్వామివారికీ .. అమ్మవారికి కల్యాణోత్సవాన్ని జరుపుతుంటారు.

లోకకల్యాణం కోసం జరిగే ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో ఆలయాలకి తరలివస్తుంటారు. ఆయురారోగ్యాలను అందించే సదాశివుడు ... సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే సర్వమంగళ ఆశీస్సులను అందుకుంటూ వుంటారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడం వలన సమస్తపాపాలు ... దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News