మల్లెలతో మహాదేవుడి అర్చన ఫలితం !
మానవాళికి పుణ్యఫలాలను ప్రత్యక్షంగా అందించడానికి పరమశివుడు కైలాసం నుంచి భూమి మీదకి దిగివచ్చి లింగస్వరూపంగా ఆవిర్భవించిన పర్వదినమే మహాశివరాత్రి. ప్రతినెలలోను అమావాస్యకి ముందుగావచ్చే చతుర్దశి ఆదిదేవుడికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. దీనినే 'మాసశివరాత్రి' గా భక్తజనకోటి జరుపుకుంటూ వుంటారు. వాటిలో మాఘమాసంలోని బహుళ పక్ష చతుర్దశి మరింత విశిష్టతను సంతరించుకుని 'మహాశివరాత్రి' గా భక్తులను పునీతులను చేస్తోంది.
ఈ రోజున ప్రతి శివలింగంలోను ఆదిదేవుడి అంశ అంతర్భూతమై ఉంటుంది. అందువలన ఈ రోజంతా భక్తులు ఉపవాస దీక్షను చేపట్టి ఆ స్వామిని సేవిస్తూ వుంటారు. ఈనాటి అర్థరాత్రి వేళను 'లింగోద్భవ' కాలంగా చెబుతుంటారు. ఈ సమయంలో ఆ సదాశివుడిని పూజిస్తూ ... అంకితభావంతో ఆరాధిస్తూ వుండాలి. ఈ రోజున శివుడిని పూజించడం వలన అనేక శైవక్షేత్రాలను దర్శిచిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. అందువలన ఆ స్వామిని అర్చించే అవకాశాన్ని భక్తలు ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోరు.
ఈ రోజున వివిధరకాల అభిషేక ద్రవ్యాలతో శివుడిని పూజిస్తుంటారు. బిల్వపత్రాలతో పాటు అనేక రకాల పుష్పాలను సమర్పిస్తుంటారు. సదాశివుడికి ప్రీతికరమైనవని చెప్పే పూలలో నందివర్ధనాలు .. జాజులు .. గన్నేరులు .. ఉమ్మెత్తపూలు .. శంఖు పుష్పాలు.. మల్లెపూలు కనిపిస్తూ వుంటాయి. స్వామికి ఇష్టమైన ఈ పూలలో ఒక్కోరకం పూలతో అర్చించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ పూలలో 'మల్లెపూలు' మరింత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. శివుడికి ఈ పూలంటే చాలా ఇష్టమట. మల్లెపూలతో జరిపే అర్చనను ఇష్టపడతాడు కనుకనే ఆయనని 'మల్లికార్జునుడు' అని పిలుస్తుంటారు. మహాశివరాత్రి రోజున ఆ స్వామిని మల్లెపూలతో పూజించడం వలన ఆయన అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందని అంటారు. బిల్వపత్రాలతో స్వామిని అర్చించడం వలన సమస్త భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది. మల్లెపూలతో స్వామిని పూజించినా అదే ఫలితం లభిస్తూ వుండటం విశేషం. అందువలన ఈ రోజున లింగోద్భవ కాలంలో స్వామిని మల్లెపూలతో ఆరాధించడం మరచిపోకూడదు.