ఆదిదేవుడి అభిషేక ఫలితాలు
అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యం ... దానధర్మాలు చేసిన పుణ్యం ... దివ్య తీర్థాలలో స్నానమాచరించడం వలన కలిగే పుణ్యం, మహాశివరాత్రి రోజున శివలింగ దర్శనభాగ్యం వలన ... శివలింగ అభిషేకం వలన కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున పూజా మందిరాలలోనూ ... దేవాలయాల్లోను పరమశివుడిని పంచామృతాలతో అభిషేకిస్తుంటారు. ముందుజన్మలకి అవసరమైన పుణ్యఫలాలను మూటగడుతుంటారు.
ఇక ఈ రోజున ఒక్కో అభిషేక ద్రవ్యంతోను స్వామిని అభిషేకిస్తుంటారు. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో ఆదిదేవుడిని అభిషేకిస్తూ ఉండటం వలన ఒక్కో విశేషమైన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. సాధారణంగా అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు ... శత్రుబాధలు ... అపజయాలు జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. గతంలో చేసిన పాపాల ఫలితంగానే ఇలాంటి సమస్యలలో చిక్కుకుని దుఃఖానికి దగ్గర కావడం జరుగుతూ వుంటుంది.
అలాంటి పాపాల నుంచి బయటపడి, అన్ని బాధల నుంచి విముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించేదిగా 'మహాశివరాత్రి' కనిపిస్తుంది. ఈ రోజున స్వామివారిని ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకిస్తూ కావసిన వరాలను ఆదిదేవుడి అనుగ్రహంతో పొందవచ్చునని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున సదాశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన పాపాలు నశించి దుఃఖం దూరమవుతుంది.
ఇక ఆవుపెరుగుతో అభిషేకం జరపడం వలన అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యం రక్షించబడుతూ వుంటుంది. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం వలన సంపద పెరుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన శత్రుబాధలు ... అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అందువలన ఈ రోజున ఆ పరమేశ్వరుడిని వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో పూజిస్తూ వుండాలి. భస్మధారణ ... రుద్రాక్ష ధారణ కలిగి ఆ స్వామిని సేవిస్తూ వుండాలి.