మహాపాపాలను నశింపజేసే మహాశివరాత్రి
మాఘమాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి 'మహాశివరాత్రి'గా చెప్పబడుతోంది. ఈ రోజునే 'లింగోద్భవం' జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో రంగవల్లులు దిద్ది ... గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజామందిరాన్ని పూలమాలికలతో అలంకరించుకోవాలి. మనసంతా శివమయం చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకం చేయాలి.
శివ స్తోత్రాలు పఠిస్తూ బిల్వదళాలతో స్వామిని సేవించాలి. వివిధరకాల పండ్లు ... పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున రాత్రి నాలుగు జాములలోను ఆ స్వామిని పూజిస్తూ వుండాలి. 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రన్నీ స్మరిస్తూ గానీ, శివసంబంధమైన కీర్తనలు ఆలపిస్తూ .. భజనలుచేస్తూగాని జాగరణ పూర్తిచేయాలి.
ఈ రోజున చేసే రుద్రాభిషేకం అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని చెప్పబడుతోంది. సాధారణంగా తెలిసో తెలియకో చేసిన కొన్ని పాతకాలు జన్మజన్మలపాటు వెంటాడుతూ వుంటాయి. అలాగే గ్రహసంబంధమైన దోషాలు కూడా తరుముతుంటాయి. అందువలన అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వుంటుంది. అనారోగ్యాలను భరిస్తూ ఆందోళన పడవలసి వుంటుంది.
మహాశివరాత్రి రోజున చేసిన రుద్రాభిషేక ఫలితం వలన అలాంటి పాతకాలన్నీ ప్రక్షాళన చేయబడతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడి రాకవలన చీకటి ఎలా అదృశ్యమవుతుందో, మహాశివరాత్రి రోజున మహాశివుడికి చేసిన రుద్రాభిషేకం వలన పాపాలు అలా పటాపంచలవుతాయని స్పష్టం చేయబడుతోంది.