అద్భుతమైన ఆ సంఘటన ఇక్కడే జరిగిందట !

ఆదిదేవుడి నుంచి అత్యంత శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాలని అర్జునుడు అనుకుంటాడు. అందుకోసం అడవీప్రాంతంలో కఠోర తపస్సుకు పూనుకుంటాడు. అర్జునుడి తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు, కొండజాతికి చెందిన యువకుడిగా అక్కడికి చేరుకుంటాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక వరాహం, అర్జునుడి తపస్సుకి భంగం కలిగిస్తూ వుంటుంది. దాంతో ఆయన దానిపైకి బాణ ప్రయోగం చేస్తాడు.

మరోవైపు నుంచి ఆ కొండజాతి యువకుడు కూడా దానిమీదకి బాణాన్ని వదులుతాడు. రెండుబాణాలు ఒకేసారి తలగడంతో ఆ వరాహం అక్కడే ప్రాణాలు వదులుతుంది. దానిని వేటాడినది తానని అర్జునుడు అంటే ... దానికి ముందుగా తగిలినది తన బాణమేనని శివుడు రెచ్చగొడతాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్యా మాటామాటా పెరిగి యుద్ధం వరకూ వెళుతుంది.

తనని చాలాతేలికగా ఎదుర్కుంటోన్న యువకుడు సామాన్యుడు కాదనీ, సదాశివుడని గ్రహించిన అర్జునుడు తన అజ్ఞానాన్ని మన్నించమని కోరతాడు. ఆ సమయంలోనే అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆసక్తికరమైన ఈ కథనాన్ని వింటున్నప్పుడు ఇది ఎక్కడ జరిగి ఉంటుందా అనే ఆలోచన కలుగుతూ వుంటుంది. అద్భుతమైన ఈ సంఘటన జరిగినది 'సలేశ్వరం' క్షేత్రంలోనేనని స్థానికులు చెబుతుంటారు.

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగల విశిష్టమైన శైవ క్షేత్రాల్లో 'సలేశ్వరం' ఒకటిగా చెప్పబడుతోంది. కొండప్రాంతానికి చెందిన వ్యక్తి రూపంలో శివుడు ఇక్కడి వచ్చాడు కనుక, ఈ కొండ ప్రదేశంలో నివసించేవాళ్లంతా స్వామిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వుంటారు. పరమశివుడు నడయాడిన ఈ పుణ్యస్థలి మహిమాన్వితమైనదనీ, ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఇక్కడి స్వామివారి సన్నిధికి చేరుకుంటే, ప్రకృతి రూపాన్ని సంతరించుకున్న అమ్మవారి ఒడిలో ఆదిదేవుడు సేదతీరుతోన్న అనుభూతి కలుగుతుంది. ఆ దేవదేవుడి దర్శనభాగ్యంతో జన్మధన్యమైందనే ఆనందం కలుగుతుంది.


More Bhakti News