ముక్తిని ప్రసాదించే ముక్కంటి క్షేత్రాలు
నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకువస్తోన్న గంగను కొప్పులోకి ఒడిసిపట్టి, మెల్లంగ నేలపైకి జారవిడిచినవాడు శివుడు. లోకాలను రక్షించడం కోసం పరమభయంకరమైన విషాన్ని పాయసంలా తాగినవాడు శివుడు. అసురుడైన రావణుడి కోరికమేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించినవాడు శివుడు. బాణాసురుడి అభ్యర్థన మేరకు ఆయన కోటరక్షణ బాధ్యతను చేపట్టినవాడు శివుడు. ఇక లోకకల్యాణం కోసం త్రిపురాసురులను సంహరించినది శివుడే.
ఇలా మూడువేళల్లోను .. మూడు కాలాల్లోను .. మూడుకన్నులతోను ... మూడుకోణాలు కలిగిన 'త్రిశూలం'తో సదాశివుడు సదా తన భక్తులను రక్షిస్తూ వుంటాడు. ఆ భక్తుల ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగించేవారిని అణచేస్తూ వుంటాడు. అలాంటి మహాశివుడు కొలువైన ప్రతి క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహంతో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా 'వాడపల్లి' కృష్ణనదీ తీరంలో స్వామి ఆవిర్భవించి 'అగస్త్యేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఇక్కడ శివలింగం శిరోభాగం నుంచి అదేపనిగా నీరు వస్తూవుంటుంది.
ఇక ఇదే జిల్లాలోగల కోదాడ మండలం పరిధిలోని 'మేళ్లచెరువు' లోను ఆదిదేవుడు అలరారుతున్నాడు. ఇక్కడి శివలింగం తెల్లన్ని వర్ణాన్ని కలిగివుండటం ... శిరస్సుభాగం నుంచి 'గంగ' ఊరుతూ వుండటం విశేషం. ఇక తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలో గల 'పట్టిసం' లో స్వామి భద్రకాళీ సమేత వీరభద్రస్వామిగా దర్శనమిస్తూ వుంటాడు. గోదావరి మధ్యన గల ఈ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షం అయినప్పుడు అగస్త్యమహర్షి ఆనందంతో ఆ స్వామిని కౌగిలించుకున్నాడట. ఆ మహర్షి చేతివ్రేళ్లుగా చెప్పబడుతోన్న గుర్తులు ఇప్పటికీ శివలింగంపై కనిపిస్తుంటాయి.
అనంతపురం జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న 'బుగ్గరామలింగేశ్వరుడు' భక్తులకు దగ్గర బంధువే. ఇక్కడి శివలింగం పాదభాగం నుంచి నిరంతరం నీరు ఊరుతూ వుండటం విశేషం. రామచంద్రుడు నడయాడిన ఈ పుణ్యస్థలిలో అడుగుపెట్టడమే అదృష్టం. ఇక కరీంనగర్ జిల్లా పరిధిలో గల 'వేములవాడ' కూడా ప్రాచీనకాలంనాటి పుణ్యక్షేత్రమే.
నారదమహర్షి కోరిక మేరకు ఇక్కడ ఆవిర్భవించిన రాజరాజేశ్వరుడికి జరిగే శివరాత్రి ఉత్సవాలు చూసితీరవలసిందే. ఇలా ఆ స్వామి కొలువైన క్షేత్రాలు ఎన్నో తమ విశేషాలతో ... మరెన్నో మహిమలతో భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటాయి. శివరాత్రి వేడుకలతో ఆనందానుభూతులను అందిస్తూ వుంటాయి. ముక్కంటి అనుగ్రహంతో ముక్తిని ప్రసాదిస్తూ వుంటాయి.