సదాశివుడిని స్మరిస్తే సాధ్యంకానిది లేదు
పరమేశ్వరుడి నిత్యనివాసం 'కైలాసం' అయినప్పటికీ, పిలిస్తేచాలు అమ్మకన్నా ఆయన తొందరగా పలుకుతాడు. అవసరాలు తెలుసుకుని అన్నింటినీ సమకూరుస్తాడు. తన భక్తులు సమస్యల సముద్రంలో చిక్కుకున్నప్పుడు వాళ్లని ఒడ్డుకు చేర్చడానికి ఆయన పడవలా మారతాడు. కష్టాల ఎడారిలో వాళ్లు ఒంటరి ప్రయాణం చేయవలసి వచ్చిన పరిస్థితుల్లో ఆయన ఒయాసిస్సులా మారతాడు.
తన భక్తులు ఆర్తితో పిలిస్తేచాలు కైలాసాన క్షణకాలమైనా కుదురుగా వుండలేనివాడే సదాశివుడు. అలాంటి దేవదేవుడిని ఆరాధిస్తూ ఎంతోమంది మహాభక్తులు ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకోగలిగారు. అలాంటి అసమానమైన భక్తులలో 'శిలాదుడు' ఒకరుగా కనిపిస్తుంటాడు. పుత్రసంతానం కోసం ఆయన కఠోర తపస్సుచేసి పరమశివుడి అనుగ్రహాన్ని పొందుతాడు. ఫలితంగా జన్మించినవారే నందీశ్వరుడు ... పర్వతుడు.
ఈ ఇద్దరు కూడా సదాశివుడికి మహాభక్తులు. బాల్యం నుంచే వాళ్లు పరమశివుడి పాదపద్మాలను ఆశ్రయిస్తారు. అసమానమైన తమ తపోశక్తితో ఆ స్వామి సాక్షాత్కారాన్ని పొందుతారు. తనకి పర్వత రూపాన్నిచ్చి తన శిరోభాగాన నివసించవలసిందిగా పర్వతుడు కోరతాడు. అనునిత్యం స్వామి సేవా భాగ్యాన్ని తనకి కల్పించవలసిందిగా నందీశ్వరుడు ప్రార్ధిస్తాడు. నందిని తన వాహనంగా స్వీకరించి అతని కోరికను ఆ దేవదేవుడు మన్నిస్తాడు. అలాగే పర్వతుడిని శ్రీపర్వతంగా మార్చి ఆ పర్వతంపై అమ్మవారితో పాటుగా స్వామి కొలువుదీరతాడు.
మల్లికార్జునుడుగా స్వామివారు ... భ్రమరాంబాదేవిగా అమ్మవారు వేంచేసిన ఆ పుణ్యక్షేత్రం 'శ్రీశైలం'గా విలసిల్లుతోంది. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షంగా కొలువైన క్షేత్రం కాబట్టి ఇది భూకైలాసంగా పేర్కొనబడుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ... అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే పాపాలు పటాపంచలైపోతాయి. మహాశివరాత్రి రోజున ఈ క్షేత్ర దర్శనం చేసినవారికి శివసాయుజ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.