ఆదిదేవుడికి కావలసింది అంకితభావమే !
పరమశివుడి అనుగ్రహం కోసం దేవతలు ... మహర్షులు యజ్ఞయాగాలు నిర్వహించారు. ఆ స్వామి కరుణాకటాక్షాలను పొందారు. సాధారణమైన మానవులలో సైతం మహాభక్తులు వున్నారు. వాళ్లలో ఎంతోమంది కవిపండితులు ఆ దేవదేవుడిని కీర్తించి తరించారు. ఇక దేవతలు ... మహర్షులు ... మహాపండితులు మాత్రమే స్వామి అనుగ్రహాన్ని అందుకోవడానికి అర్హులనే సందేహం ఏ కాలంలోనూ ఏ భక్తుడికి కలగలేదు. అందుకు కారణం ఆ సదాశివుడు అందరినీ సమానంగా అనుగ్రహిస్తూ ఉండటమే.
పండితుడినుంచైనా పామరుడినుంచైనా ఆయన ఆశించేది అంకితభావాన్ని మాత్రమే. మహాపండితులైన నాయనార్లను పరమేశ్వరుడు ఎలా కటాక్షించాడో ... అక్షరజ్ఞానంలేని కన్నప్పను సైతం అంతగాను అనుగ్రహించాడు. దేవతలకు ... మహర్షులకు ... సాధారణ మానవులకు ... అసురులకు మాత్రమేకాదు, జంతువులకు .. క్రిమికీటకాలకు కూడా మోక్షాన్ని ప్రసాదించడం ఆదిదేవుడి మంచిమనసుకు నిదర్శనం.
తనని సేవించిన సాలెపురుగు ... నాగుపాము ... ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించి, ఆ క్షేత్రం వాటిపేరుతో 'శ్రీకాళహస్తి' గా ప్రసిద్ధిచెందేలా అనుగ్రహించడం ఆయనకే చెల్లింది. ఇదే క్షేత్రంలో కన్నప్ప గుడి కొండపైనా ... స్వామివారి ఆలయం కొండదిగువన కనిపిస్తాయి. భక్తుడికి స్వామివారు ఇచ్చే స్థానం ఎలా ఉంటుందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కోక్షేత్రంలో ఆయన లీలావిశేషం ఒక్కోలా కనిపిస్తూ ఆయన సన్నిధికి చేరుస్తుంటుంది.
మంత్రపూర్వకంగా అర్చించినా ... కవితాశక్తితో కీర్తించినా ... అక్షరంతో పరిచయం లేకపోయినా అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించినా ఆ మహాదేవుడు సంతోషంగా స్వీకరిస్తూ వుంటాడు. ప్రేమతత్త్వమే మహాశివుడికి తెలిసిన మంత్రం. నమఃశివాయ అంటూ నమస్కరిస్తే చాలు పుణ్యఫలాలను మూటగట్టి దోసిట్లో వుంచుతాడు. ఆయన మనసు గెలుచుకోవడానికి మహాశివరాత్రికి మించిన అవకాశం లేదు. ఈ రోజున శివలింగానికి దోసెడు నీళ్లు పోసి .. చిటెకెడు విభూతి రాసి .. ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు, ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలతో పాటు మోక్షాన్ని సైతం ప్రసాదిస్తూ వుంటాడు.