మహాశివరాత్రి రోజున క్షేత్రదర్శనం
జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి మానవాళికి లభించిన మహదావకాశమే మహాశివరాత్రి. అలాంటి ఈ రోజుని ఆ సదాశివుడి సేవలో సద్వినియోగం చేసుకోవడానికి అశేష భక్తజనులు ప్రయత్నిస్తూ వుంటారు. ఆదిదేవుడు స్వయంభువుగా ఆవిర్భవించిన పుణ్యక్షేత్రాలను ఈ రోజున దర్శించుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాల్లో ఉపవాస జాగరణలతో ఆయనకి పూజాభిషేకాలు జరపడానికి ఆతృతపడుతుంటారు.
లోకకల్యాణం కోసం శివుడు చూపిన లీలలు అన్నీఇన్నీకావు. ఆయన లీలావిశేషాలలోని భాగంగానే ద్వాదాశ జ్యోతిర్లింగాలు ... పంచభూత లింగాలు ... పంచారామాలు దర్శనమిస్తూ వుంటాయి. సోమనాథ జ్యోతిర్లింగం .. మల్లికార్జున జ్యోతిర్లింగం .. మహాకాలం .. ఓంకారేశ్వరం .. కేదరనాధం .. భీమశంకరం .. విశ్వేశ్వరం .. త్రయంబకేశ్వరం .. వైద్యనాథం .. నాగేశ్వరం .. రామేశ్వరం .. ఘశ్మేశ్వర జ్యోతిర్లింగాలలో ఈ రోజున ఏ ఒక్కదానిని దర్శించినా అనంతమైన పుణ్యఫలాలు అక్కునచేరతాయి.
ఇక పంచభూత లింగాలుగా చెప్పబడుతోన్నక్షేత్రాలను ఈ రోజున దర్శించుకున్నా, సాక్షాత్తు పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా దర్శించి సేవించిన భాగ్యం లభిస్తుంది. కంచిలో 'పృథ్వీలింగ' రూపంలోను .. చిదంబరంలో 'ఆకాశలింగం' గాను .. జంబుకేశ్వరంలో 'జలలింగం' గాను .. తిరువణ్ణామలైలో 'అగ్నిలింగం' గాను .. శ్రీకాళహస్తిలో 'వాయులింగం' గాను స్వామి ఆవిర్భవించాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా అంతకుమించిన మహద్భాగ్యం మరొకటిలేదు.
ఇక పరమశివుడు ప్రత్యక్షంగా కొలువైవున్నట్టుగా చెప్పబడుతోన్న విశిష్టమైన క్షేత్రాల్లో 'పంచారామాలు' కనిపిస్తూ వుంటాయి. అమరారామం .. ద్రాక్షారామం .. కుమారారామం .. సోమారామం .. క్షీరారామం అనే ఈ పంచారామాలలో అడుగుపెట్టినంత మాత్రాన్నే అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతోంది.
ఇక 'త్రిలింగ' క్షేత్రాలుగా శ్రీశైలం .. శ్రీకాళహస్తి .. ద్రాక్షారామానికి గల ప్రాధాన్యత కూడా అంతా ఇంతా కాదు. దర్శనమాత్రం చేతనే ఇవి సమస్తపాపాలను కడిగేసి సకలశుభాలను ప్రసాదిస్తాయి ... మోక్షానికి అవసరమైన అర్హతను సంపాదించిపెడతాయి. ఇలా పరమశివుడు కొలువుదీరిన ప్రతి క్షేత్రం కూడా పాపాలను నశింపజేసేదిగా కనిపిస్తుంది. పుణ్యఫలాలను రాశిగా అందించేదిగా అనిపిస్తుంది.
దూరాబారం కారణంగా .. ఆరోగ్యపరమైన ... ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా ఆయా క్షేత్రాలకు వెళ్లలేని భక్తులు బాధపడవలసిన పనిలేదు. దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకున్నా, అంతటి పుణ్యఫలితాన్ని ఆయన దోసిటపట్టి అందిస్తాడు. తనకోసం రాలేని భక్తులను ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. ఆవేదనలోగలవారిని ఆదుకునే విషయంలో ఆయన అమ్మకన్నా ఎక్కువగా ఆరాటపడతాడు. అంకితభావంతో కూడిన సేవకి ఆయన మంచుకన్నా తొందరగా కరిగిపోతాడు. అంతటి మహాదేవుడిని ఈ రోజున దర్శించాలి ... సేవించాలి ... స్మరించాలి ... కీర్తించాలి ... తరించాలి.