భగవంతుడికి నచ్చనిది అహంభావమే !
అహంభావంతో మిడిసిపడినవాళ్లు అవమానాలపాలైన సంఘటనలు ఎన్నో కనిపిస్తుంటాయి. తమ శౌర్యపరాక్రమాలు ... కీర్తిప్రతిష్ఠలు చూసుకుని ఎంతోమంది పొంగిపోయారు. తమ చుట్టూ వున్నవారు పొగుడుతూ వుంటే, తమంతవారు లేరనే గర్వంతో సాక్షాత్తు భగవంతుడినే ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. అలాంటివారిలో 'బాణాసురుడు' ఒకడుగా కనిపిస్తాడు. ఒకసారి బాణాసురుడు పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. అతని భక్తిశ్రద్ధలకు మెచ్చిన శివుడు సహస్ర బాహుబలాన్ని వరంగా ప్రసాదిస్తాడు.
ఆ వరగర్వంతోనే అతను అమరలోకంపై దండెత్తుతాడు. ఒక్కొక్కటిగా సాధిస్తోన్న విజయాలు అతనికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాంతో బాణాసురుడు నేరుగా శివుడి దగ్గరికి వెళతాడు. తన శక్తిసామర్థ్యాలను గురించి ప్రస్తావిస్తాడు. తనకి ఎదురుగా నిలబడి పోరాడే శక్తిమంతుడు ఎక్కడా తారసపడలేదని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తాడు. తనతో పోరాటానికి సిద్ధమై, తన బాహుబలాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇవ్వమని శివుడిని అడుగుతాడు.
తాను ప్రసాదించిన వరబల గర్వంతో తననే పోరుకి పిలుస్తోన్న బాణాసురుడి ధోరణి శివుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరాన్ని ప్రసాదించిన తానే దానిని పరీక్షించాలనుకోవడం సరైనది కాదనీ, తనంతటి శక్తిమంతుడితో యుద్ధంచేసే అవకాశం త్వరలోనే అతనికి కలుగుతుందని చెబుతాడు శివుడు. స్వామి అలా ఎందుకన్నాడనేది శ్రీకృష్ణుడితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు బాణాసురుడికి అర్థమవుతుంది.
బాణాసురుడి కుమార్తె అయిన ఉష .. కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడిని ప్రేమిస్తుంది. వారి వివాహానికి నిరాకరించిన బాణాసురుడు, అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడిని బంధవిముక్తుడిని చేయడమే కాకుండా, అతనితో ఉష వివాహానికి అంగీకరించమని బాణాసురుడిని హెచ్చరించడానికి శ్రీకృష్ణుడు వస్తాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగిన బాణాసురుడు ఆయన్ని ఎదిరించలేక అవమానం పాలవుతాడు.