రాహుగ్రహ దోష ప్రభావం ఇలా తగ్గుతుంది
జాతకంలో రాహుగ్రహ సంబంధమైన దోషం వున్నవాళ్లు నానాఅవస్థలు పడుతుంటారు. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతూ వుండటం ... తలపెట్టినపనులకి ఆటంకం కలుగుతూ వుండటం ... అవమానాలు ఎదురవుతూ వుండటం ఈ దోషం గలవారికి మరింత బాధను కలిగిస్తూ వుంటాయి. రాహువును శాంతింపజేయడం కోసం ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు.
రాహుగ్రహ ప్రభావాన్ని తగ్గించే మార్గాలలో ఒకటిగా 'అష్టముఖి' రుద్రాక్ష ధారణ కనిపిస్తుంది. ఎనిమిది ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ఎంతో శక్తిమంతమైనది ... మరెంతో మహిమాన్వితమైనది. రుద్రుడి కంటి నుంచి ఉద్భవించిన రుద్రాక్ష, వివిధ రకాలుగా ... వివిధ గుణాలతో కనిపిస్తూ వుంటుంది. ప్రతి రుద్రాక్ష కూడా తనదైన ప్రత్యేకతను సంతరించుకుని వుంటుంది. ఆ విశేషాన్ని తెలుసుకుని తాము ఆశించే ప్రయోజనానికి తగిన రుద్రాక్షను ధరిస్తుంటారు. ఇలా ఆరోగ్యాన్నీ .. ఐశ్వర్యాన్నీ .. కార్యసిద్ధిని ... గ్రహసంబంధమైన దోషాల నుంచి బయటపడటానికిగాను తగిన రుద్రాక్షలను ధరిస్తుంటారు.
ఈ నేపథ్యంలో రాహుగ్రహ సంబంధమైన దోష ప్రభావం నుంచి బయటపడటానికిగాను అష్టముఖి రుద్రాక్ష ధారణ మంచిదని చెప్పబడుతోంది. అష్టముఖి రుద్రాక్షకు పాలకుడు రాహువే. అందువలన ఈ రుద్రాక్షను ధరించడం వలన ఆయన శాంతిస్తాడని అంటారు. రాహువు శాంతించడం వలన ఆయన చూపే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా ఈ రుద్రాక్షను ధరించినవారి మనసు తేలికపడుతుంది ... ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.