మరుజన్మలోను కరుణించే మహాశివుడు
మనసుతో మాత్రమే గెలవగలిగినవాడు మహాశివుడు. అంకితభావాన్ని తప్ప ఆయన మరి దేనినీ ఆశించడు. ఆయన సన్నిధిలో వెలిగించిన దీపం ... అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి భగవంతుడి తత్త్వాన్ని అర్థంచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆదిదేవుడికి చేసిన అభిషేకం సమస్తపాపాలను సమూలంగా కడిగేస్తుంది. ఆ స్వామికి అర్పించిన నైవేద్యం ఆయుష్షును పెంచుతుంది. ఇలా పరమేశ్వరుడికి చేసిన ఏ సేవా వృధా కాదు.
మంచిమనసుతో సదాశివుడిని సేవించినవారికి మరుజన్మలోను ఆయన కరుణాకటాక్షాలు లభిస్తాయని చెప్పడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. వాటిలో శివభక్తులైన భిల్లజాతి దంపతుల జీవితం ఒకటిగా వినిపిస్తూ వుంటుంది. తమకి లభించిన ప్రతిదీ పరమశివుడి ప్రసాదంగా భావించి స్వీకరించడం, అందరిలోనూ ఆ స్వామిని దర్శించడం మినహా ఆ దంపతులకి మరోవిషయం తెలియదు.
అలాంటి ఆ దంపతులను పరీక్షించడానికి ఒకసారి మహాశివుడు మారువేషంలో వస్తాడు. వాళ్లిద్దరూ నివసిస్తోన్న 'గుహ' చాలా చిన్నదని తెలిసినా, తనకి మరోమార్గం లేదని చెప్పి ఆశ్రయం ఇవ్వమని అడుగుతాడు. బయట క్రూరమృగాల భయం ఉంటుందని ఆ భిల్లజాతి పురుషుడికి తెలిసినా, మారువేషంలో గల శివుడికి ఆ గుహలో ఆశ్రయమిచ్చి తాను బయటపడుకుంటాడు. తన భర్త బయటపడుకున్నాడనే అసహనంకానీ ... ఆందోళనకాని ఆయన భార్యలో ఆదిదేవుడికి కనిపించవు.
బయటపడుకున్న కారణంగా ఆ రాత్రి అతను క్రూరమృగాల బారినపడి చనిపోతాడు. మారువేషంలోగల శివుడు విచారాన్ని వ్యక్తం చేస్తాడు. అతిథిని పరమేశ్వరుడుగా భావించడమే తమకి తెలుసనీ, అతిథిసేవలో తనభర్త మరణించినందుకు తాను బాధపడటం లేదంటూ ఆ ఇల్లాలు కూడా ప్రాణత్యాగం చేస్తుంది. అప్పుడు సదాశివుడు ఆ దంపతులకు నిజరూపంతో దర్శనమిచ్చి వాళ్ల మంచిమనసును అభినందిస్తాడు. మరుజన్మలో ఆ దంపతులు 'నలదమయంతులు'గా జన్మిస్తారనీ, కొన్నికారణాల వలన విడిపోయిన ఆ దంపతులను తాను 'హంసరూపం'లో కలుపుతానని సెలవిస్తాడు. అలా ఆ భిల్లజాతి దంపతులు మరుజన్మలోను శివుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు.