జాగరణ వల్లనే శివాదరణ లభిస్తుంది
కష్టమైనా .. నష్టమైనా .. ఆపదైనా .. అనారోగ్యమైనా పూర్వజన్మలో చేసుకున్న పాపాల ఫలితాలుగానే కలుగుతుంటాయి. అలాంటి పాపాల నుంచి బయటపడాలి .. ఇక ముందు తెలిసి ఎలాంటి పాపం చేయకుండా పుణ్యరాశిని పెంచుకోవాలనే ఆరాటం సహజంగానే అందరిలోనూ కలుగుతుంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని కల్పించే పర్వదినంగా 'మహాశివరాత్రి' కనిపిస్తుంది.
ఈ రోజున శైవక్షేత్రలన్నీ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ వుంటాయి. ఆ స్వామికి జరిపే అభిషేకాలతో ... శివనామస్మరణతో ఆలయాలన్నీ సందడిగా కనిపిస్తూ వుంటాయి. ఈ రోజున భక్తులంతా ఉపవాసంతో కూడిన జాగరణ చేస్తుంటారు. ఉపవాసం వలన శివనివాసంలో స్థానం లభిస్తుందనీ ... జాగరణ వలన శివాదరణ దక్కుతుందని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రెండింటికీ ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఇక జాగరణ విషయానికి వస్తే .. తెలియక ఉపవాసంతో కూడిన జాగరణ చేయడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు దక్కుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక తెలిసి ఉపవాసంతో కూడిన జాగరణ చేస్తున్నట్లయితే శివరాత్రి శివారాధనతోనే తెల్లవారాలి. ఏదో ఒక విధంగా మెలకువతో ఉండటమే జాగరణ అని కొంతమంది అనుకుంటూ వుంటారు. లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ తెల్లవార్లు గడిపి జాగరణ పూర్తిచేశామని భావిస్తూ వుంటారు. ఇలాంటి జాగరణ వలన ఎలాంటి ప్రయోజనం వుండదు.
శివుడిని స్తుతిస్తూ ... శివనామస్మరణచేస్తూ ... శివుడిని కీర్తిస్తూ ... శివలీలలను తలచుకుంటూ .. భక్తవశంకరుడి భజనలతో జాగరణ చేయాలి. ఆయన ధ్యాసలో ... ఆయన ధ్యానంలో తెలియకుండానే తెల్లవారాలి. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసినా ... ఇంకా తెల్లవారలేదా అని అనుకున్నా అంకితభావంలో లోపంగా గ్రహించుకోవాలి. శివరాత్రి రోజున శరీరం ... మనసు ... దృష్టి శివుడి సన్నిధిలోనే వుండాలి. ప్రతి మనసు మహాదేవుడికి మందిరం కావాలి. మహాదేవుడి అనుగ్రహంతో మోక్షాన్ని పొందడానికి మహాశివరాత్రికి మించిన మార్గంలేదు. జీవితంలో కనీసం ఒక్క శివరాత్రి రోజైనా ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో సేవిస్తూ తరించాలి. అందుకే జన్మకో శివరాత్రి అని అంటూ వుంటారు.