శివరాత్రి రోజున మహాదేవుడిని మెప్పించాలి
మహాశివరాత్రి మహాదేవుడికి ప్రీతికరమైన రోజు ... పాపాలను నశింపజేసి పుణ్యఫలితాలను ప్రసాదించే పవిత్రమైన రోజు. లయకారకుడైన శివుడు అనుగ్రహించడానికి ఆలయానికి తరలి వచ్చినట్టుగా ఎక్కడ చూసినా ఈ రోజున సందడి వాతావరణం కనిపిస్తూ వుంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి గుమ్మానికి తోరణాలు కడుతూ వుంటారు. పూజా మందిరాన్ని అందంగా అలంకరించి అక్కడ ముగ్గులు పెడుతుంటారు.
పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్న శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. సదాశివుడిని స్తుతిస్తూ బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ తరువాత ఆదిదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోన్న 'పొంగలి'ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆవుపాలు .. ఆవుపెరుగు .. ఆవునెయ్యి .. తేనె .. పంచదార పంచామృతాలుగా చెప్పబడుతున్నాయి. వీటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకాన్ని జరపడం వలన ఒక్కో విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.
అలాంటిది పంచామృత అభిషేకం ఆ ఫలితాలన్నింటిని కలిపి అందిస్తుంది. ఇక పరమేశ్వరుడికి ఒక్క బిల్వ పత్రం సమర్పించడం వలన కలిగే పుణ్యం అనేక జన్మలపాటు వెంటవస్తుంది. ఆయనకి బాగా నచ్చినదిగా చెబుతోన్న పొంగలిని నైవేద్యంగా సమర్పించడం వలన వెంటనే సంతృప్తి చెందుతాడట. అందువలన మహాశివరాత్రి రోజున పంచామృతాభిషేకం .. బిల్వపత్ర సమర్పణ ... పొంగలి నైవేద్యం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అసమానమైన భక్తిశ్రద్ధలతో ముక్కంటిని మెప్పించాలి.