పూజకోసం పూలు ఎలా కోయాలి ?
పూలు పూసేదే దైవం కోసమని చాలామంది భావిస్తుంటారు. ఈ కారణంగానే తమ ఇంటి ప్రాంగణంలో పూసిన పూలను కేవలం దేవతార్చానకి మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఇక తాజా పూలను భగవంతుడికి సమర్పించాలనే ఉద్దేశంతో, వివిధరకాల పూలమొక్కలను కూడా పెంచుతుంటారు. పూలు ఎంతో సున్నితంగా .. సుకుమారంగా వుంటాయి. వికసించి వాడిపోయేలోగా అవి భగవంతుడిని అలంకరించి ఆనందిస్తాయి ... ఆయన సన్నిధిలో సుగంధాన్ని వెదజల్లుతూ తరిస్తాయి.
జననానికీ ... మరణానికి గల మధ్యకాలం భగవంతుడి సన్నిధిలో గడపాలనే సందేశాన్ని పూలు ఇస్తుంటాయి. అలాంటి పూలను ఎప్పుడు పడితే అప్పుడు .. ఇష్టం వచ్చినట్టుగా కోయకూడదని చెప్పబడుతోంది. కొంతమంది ఉదయాన్నే స్నానం చేసి .. తడిబట్టలతోనే పూజ కోసం పూలు కోస్తుంటారు. ఈ విధంగా పూలు కోయకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. స్నానం చేసి తుడుచుకోకుండా తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడికి సమర్పించకూడదని స్పష్టం చేయబడుతోంది.
అందువలన స్నానాన్ని ఆచరించిన అనంతరం నుదుటున కుంకుమను ధరించి .. పరిశుభ్రమైన పొడి వస్త్రాలను ధరించి పూలు కోయవలసి వుంటుంది. భగవంతుడి కోసమన్నట్టుగా మనసులో చెప్పుకుని, నిదానంగా పూలను కోయాలి. కొంతమంది పూలను కొమ్మ నుంచి నిదానంగా వేరుచేసే ఓపిక లేదన్నట్టుగా కొమ్మలను విరిచేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన వికసించిన పూలతో పాటు వాటి పక్కనేగల మొగ్గలను కూడా తెంపినట్టు అవుతుంది.
వికసించని మొగ్గలను కోయడం దోషంగా చెప్పబడుతోంది గనుక, ఎప్పుడూ కూడా కొమ్మలు విరచకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే పూలు ఎంత సున్నితంగా ఉంటాయో వాటిని అంతే సున్నితంగా కోసి భగవంతుడి పాదపద్మాల చెంత సమర్పించవలసి వుంటుంది. అలా పద్ధతిగా .. పవిత్రంగా ఆ స్వామికి పూలను సమర్పించినప్పుడే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.