ధర్మాన్ని ఆశ్రయించినవారిదే విజయం
విరాటరాజుకి బావమరిది అయిన కీచకుడిని భీముడు సంహరిస్తాడు. కీచకుడి మరణవార్త కౌరవులకి తెలుస్తుంది. అంతటి బలవంతుడిని అంతంచేయడం కేవలం భీముడి వలన మాత్రమే అవుతుందనీ, పాండవులు విరాటరాజు కొలువులో వున్నారని కౌరవులు గ్రహిస్తారు. పాండవుల అజ్ఞాతవాసానికి భంగం కలిగించి తిరిగి వారితో అరణ్యవాసం చేయించాలని నిర్ణయించుకుంటారు. విరాటరాజు ఆశ్రయంలో రహస్యంగా వున్న పాండవులను బయటికి రప్పించాలని అనుకుంటారు.
అందుకుగాను విరాటరాజు రాజ్యానికి చెందిన గోవులను తమ రాజ్యంలోకి మళ్లించాలని నిర్ణయించుకుంటారు. అప్పట్లో గోవులను ప్రధానమైన సంపదగా భావిస్తూ వుండేవాళ్లు. అందువలన శత్రుదేశపు రాజుల గోసంపదను ముందుగా కొల్లగొడుతూ వుండేవారు. వీరులైనవారు గోసంపద తరలిపోకుండా చూసుకునేవారు. వీరత్వం గల పాండవులు గోసంపద తరలిపోతూ వుంటే చూస్తూ ఊరుకోరు గనుక, వాళ్లను బయటికి రప్పించడానికి కౌరవులు ఈ పథకం వేస్తారు.
విరాటరాజు పుత్రుడైన 'ఉత్తరకుమారుడు' పిరికితనంతో వెనుకంజ వేయడంతో, అప్పటివరకూ బృహన్నలగా వున్న అర్జునుడు రంగంలోకి దిగవలసి వస్తుంది. ఈ సమయంలోనే 'శమీవృక్షం'పై దాచిన తమ ఆయుధాలను ఉత్తరకుమారుడితో కిందకి దింపిస్తాడు అర్జునుడు. అజ్ఞాతవాస కాలం పూర్తయిందన్న విషయాన్ని కౌరవులకు గుర్తుచేసి, తన గాండీవంతో వాళ్లకి తగిన సమాధానం చెబుతాడు. గోసంపదను కాపాడి వీరుడిగా తిరిగివస్తాడు. అలా కౌరవుల కుతంత్రం నుంచి ఎప్పటిలానే ధర్మమనేది పాండవులను కాపాడుతుంది.