సదా రక్షించువాడే సదాశివుడు
భగవంతుడు అందరిపట్ల సమానమైన దృష్టిని కలిగివుంటాడు. ఆయన దృష్టిలో ఎవరూ ఎక్కువా కాదు ... తక్కువా కాదు. ఒకరికి మంచిచేయడం కోసం ఇంకొకరికి చెడు చేయడమనేది ఆయన తత్త్వంలోనే కనిపించదు. అయితే సదా తన ధ్యాసలోనే కాలాన్ని గడుపుతూ ఉండేవారి బాగోగుల విషయంలో ఆయన ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటూ వుంటాడు. తనని సేవించడం కంటే తన భక్తులకు సాయంచేసిన వారి పట్లనే ఆయన ఎక్కువ ప్రీతిని కలిగివుంటాడు.
తనని నమ్ముకుని వున్నవారికి కష్టం కలిగినప్పుడు యజమాని ఎలా అండగా నిలబడతాడో, భగవంతుడు కూడా తనని విశ్వసించినవారిని సదారక్షిస్తూ వుంటాడు. తన భక్తులకు హానికలిగించడానికి ప్రయత్నించినవారికి పరోక్షంగా హెచ్చరికలు పంపుతాడు. అప్పటికీ ఖాతరు చేయకపోతే తగినశిక్షను విధిస్తాడు. శివభక్తుడైన 'వాగీశ నాయనార్' విషయంలోనూ ఇదే విషయం స్పష్టమవుతుంది.
వాగీశనాయనార్ మహాశివభక్తుడు. అనునిత్యం ఆయన శివారాధన చేస్తూ .. ఆ దేవదేవుడిని కీర్తిస్తూ ఉండేవాడు. అనేక ప్రాంతాలను దర్శిస్తూ అక్కడి ప్రజలను ప్రభావితంచేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవాడు. అలాంటి వాగీశనాయనార్ ని ఆనాటి పల్లవరాజు అనేక ఇబ్బందులకు గురిచేస్తాడు. శివారాధనకి వ్యతిరేకంగా గల ఆయన ఆదేశాలను వాగీశనాయనార్ పాటించకపోవడమే అందుకు కారణం.
ఆయన ఎన్ని విధాలుగా చిత్రహింసలకి గురిచేసినా వాగీశనాయనార్ తన మనసు మార్చుకోడు. హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని శ్రీహరి ఎలా రక్షిస్తూ వస్తాడో, ఆ రాజు విధించిన ప్రతి శిక్ష నుంచి ఆ పరమశివుడే వాగీశుడిని కాపాడుతూ వస్తాడు. సదాశివుడు తన భక్తులను సదా రక్షిస్తూ వుంటాడనే విషయాన్ని ఈ సంఘటన మరోమారు నిరూపిస్తూ వుంటుంది.