మహాశివరాత్రి మహాత్మ్యం అలాంటిది !
మహాశివరాత్రి ... సమస్త పాపాలను ప్రక్షాళన చేసుకుని పుణ్యఫలాలను పొందడానికి మానవాళికి లభించిన మహోన్నతమైన అవకాశం. తీరికలేదనే పేరుతో పుణ్యరాశికి దూరంగా వున్నవారికి సాక్షాత్తు ఆ సదాశివుడు ప్రసాదించిన అపూర్వ వరం. కైలాసం నుంచి దిగివచ్చిన ఆదిదేవుడిని సభక్తికంగా ఆరాధించినప్పుడే జీవితానికో అర్థం లభిస్తుంది. పరమేశ్వరుడి పూజలో తరించడంకన్నా పరమార్థం లేదని గ్రహించినప్పుడే జన్మధన్యమవుతుంది.
అలాంటి ఈ రోజుని సద్వినియోగం చేసుకోలేనివాళ్లు, పాపకూపంలోనే కొట్టుమిట్టాడుతూ వుంటారు. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా నియమనిష్టలను పాటిస్తూ పూజాభిషేకాల్లో పాల్గొన్నప్పుడే పుణ్య ఫలితాలు లభిస్తూ వుంటాయి. ఎన్నో సంవత్సరాలపాటు భగవంతుడి సన్నిధిలో ఆయనని సేవిస్తూ గడిపితే మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుంది. కానీ మహాశివరాత్రి రోజున తెలియక ఉపవాసం చేసినా ... జాగరణచేసినా ... శివార్చనలో పాల్గొన్నా శివసాయుజ్యం లభిస్తుంది.
ఇందుకు ఒక ఉదాహరణగా మనకి కన్నప్ప కథ కనిపిస్తూ వుంటుంది. కండబలాన్ని నమ్ముకున్న కన్నప్ప ఎప్పటిలానే 'మహాశివరాత్రి' రోజున కూడా వేటకి వెళతాడు. ఆ రోజున అతనికి వేట దొరక్కపోవడంతో పస్తు వుంటాడు. వేటకోసం ఎదురుచూస్తూ ఆ రాత్రంతా ఒక చెట్టుపై కూర్చుంటాడు. ఆ పక్కనేగల మారేడుచెట్టు కొమ్మనుంచి ఆకులు కోస్తూ ... వాటిని కిందకి విసురుతూ తెలియకనే జాగరణ చేస్తాడు. ఆ మారేడు దళాలు ఆ చెట్టుకిందగల శివలింగంపై పడతాయి. అతని దగ్గరగల తోలుసంచీలోని నీళ్లు అప్పుడప్పుడూ ఒలుకుతూ ఆ శివలింగంపై పడతాయి.
అలా లింగోద్భవ కాలంలో తనకి తెలియకుండానే కన్నప్ప శివారాధన చేస్తాడు. ఫలితంగా అతనికి సదాశివుడి ప్రత్యక్ష దర్శనం లభిస్తుంది. ఆయన అనుగ్రహంతో మోక్షం లభిస్తుంది. తెలియక పూజించినా శివానుగ్రహాన్ని ప్రసాదించడమే మహాశివరాత్రి మహాత్మ్యం. అలాంటి పర్వదినాన అత్యంత భక్తి శ్రద్ధలతో ... నియమనిష్టలతో ఆ స్వామికి పూజాభిషేకాలు జరపడం వలన పెరిగే పుణ్యరాశిని ఊహించుకోవచ్చు. అందుకే మహాశివరాత్రి రోజున మహాదేవుడి సన్నిధిలో గడపాలి. ఆ దేవదేవుడికి పూజాభిషేకాలను జరుపుతూ తరించాలి.