పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించాలి

పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైనది. ఈరోజున ఆ స్వామిని పూజించడం వలన ఆయన ప్రీతిచెందుతాడు. ఇక మాసశివరాత్రి రోజున ఉపవాసదీక్షను చేపట్టి, జాగరణకి సిద్ధపడి ప్రదోషవేళలో ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన ఆ దేవదేవుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి. స్వామివారికి అత్యంత ఇష్టమైన కార్తీకమాసంలో ఆయనని సేవించినవారికి దక్కని పుణ్యం లేదు. అందువలన ఈ మాసంలో శివాలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కనిపిస్తుంటాయి.

ఇలా విశేషమైన రోజుల్లో అధికఫలితాలను అందించే ఆదిదేవుడిని మరింత త్వరగా ప్రసన్నం చేసుకునే పర్వదినంగా 'మహాశివరాత్రి' కనిపిస్తుంది. మహాదేవుడు ఈరోజునే లింగరూపంలో భూలోకంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మానవాళిని అనుగ్రహించడం కోసం ఆ స్వామి కైలాసం నుంచి కదలివచ్చిన రోజు కావడంతో, అశేష భక్తజనకోటి ఆయన కొలువైన ఆలయాలను దర్శిస్తూ వుంటారు. ఉపవాసంతో కూడిన జాగరణను చేపట్టి, ఆయన పూజాభిషేకాలను జరుపుతుంటారు.

మహాశివరాత్రి రోజున శివారాధన చేయడం వలన కలిగే ఫలితం జన్మజన్మలను ప్రభావితం చేస్తుంది. ఎండలో ప్రయాణం చేస్తోన్నవాళ్లు చెట్టు నీడను ... వర్షంలో చిక్కుకున్నవాళ్లు ఏదైనా ఒక ఇంటిని ఆశ్రయిస్తుంటారు. చీకటిలో వున్నవాళ్లు దీపాన్నీ ... నిస్సహాయులు ధర్మదాతలను ఆశ్రయిస్తుంటారు. అలాగే సమస్త పాపాల నుంచి బయటపడాలనుకునే వాళ్లు పరమేశ్వరుడి పాదపద్మాలను ఆశ్రయించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News