పరమాత్ముడు చూపించే మార్గమే మోక్షం
భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ఆయన సేవలోనే తరింపజేసుకోవాలనే విషయాన్ని కొంతమంది మాత్రమే అర్థంచేసుకుంటూ వుంటారు. మోక్షాన్ని సాధించడానికి శరీరం ఒక సాధనమనే విషయాన్ని గ్రహిస్తుంటారు. జననమరణ చక్రంలో చిక్కుకోకుండా మోక్షాన్ని సంపాదించుకోవాలని ఆరాటపడుతూ వుంటారు.
తల్లి కడుపులో వున్నప్పుడు ... బయట ప్రపంచంలోకి వచ్చిన తరువాత అనేక ఇబ్బందులు కష్టాలు పడవలసి వస్తుంది. ఆశలు ... బంధాలు ... వ్యామోహాలు ఇలా అన్నీ వెంటాడుతూ వుంటాయి. వాటి బారి నుంచి బయటపడలేక నానాఅవస్థలు పడవలసి వస్తుంది. ఎవరి కోసమైతే కష్టపడతారో ... ఎవరి కోసమైతే త్యాగాలు చేస్తారో చివరికి వాళ్లచేతనే నిరాదరణకి గురవుతుంటారు.
అయ్యో భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితంలో క్షణకాలమైనా ఆయనని తలచుకోకుండా వృధా చేసుకున్నాననే పశ్చాత్తాపం అప్పుడు కలుగుతుంది. అలా పూర్తిగా మాయలో చిక్కుకోకుండా తామరాకుపై నీటిబొట్టు తిరిగి అదే కొలనులోకి జారిపోయినట్టు, బాధ్యతలను ... కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడి సేవలో నిమగ్నం కావాలి. అనునిత్యం ఆ కృష్ణ పరమాత్ముడిని పూజిస్తూ సేవిస్తూ వుండాలి. కృష్ణ నామస్మరణ చేస్తూ ... కృష్ణలీలలు తలచుకుంటూ వుండాలి.
అలా మనసుని పరమాత్ముడి నిత్య నివాసంగా మార్చుకున్నవాళ్లు, మరణ సమయంలో ఆయన్ని తలచుకోకున్నా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సాక్షాత్తు కృష్ణపరమాత్ముడే ఈ విషయాన్ని భగవద్గీతలో స్పష్టం చేశాడు. మరణ సమయంలో మనసు .. మాట .. శరీరం అధీనంలో వుండవు. అందువలన భగవంతుడి నామస్మరణ చేసే అవకాశం లభించకపోవచ్చు. అందుకే శరీరం చైతన్యవంతంగా ఉన్నప్పుడే భగవంతుడిని సేవిస్తూ వుండాలి. కృష్ణభగవానుడు చూపిన ధర్మమార్గంలో ప్రయాణిస్తూ వుండాలి. అసమానమైన ఆరాధనతో ఆయన అనుగ్రహానికి పాత్రులై మోక్షాన్ని సాధించాలి.