కాలం కలిసిరాకపోతే అంతే !

కణ్వమహర్షి కూతురుగా పెరిగిన శకుంతలను దుష్యంత మహారాజు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆమెని సగౌరవంగా తన రాజ్యానికి తీసుకువెళతానని చెప్పివెళ్లిన దుష్యంతుడు, దూర్వాసమహర్షి శాపఫలితంగా శకుంతలను మరిచిపోతాడు. ఈ విషయం తెలియని శకుంతల ఎన్నో ఆశలతో దుష్యంతమహారాజుని కలుసుకుంటుంది. తానెవరన్నది తెలియదన్నట్టుగా దుష్యంత మహారాజు ప్రవర్తించడంతో ఆమె నివ్వెరపోతుంది.

గాంధర్వ వివాహ సమయంలో ఆయన తన వ్రేలుకి తొడిగిన ఉంగరాన్ని గుర్తుగా చూపించాలనుకుంటుంది. ఆ ఉంగరం తన వ్రేలుకి లేకపోవడాన్ని అప్పుడు ఆమె గమనిస్తుంది. కాలం తనని పరీక్షిస్తుందనే విషయం అప్పుడు ఆమెకి అర్థమవుతుంది. భారమైన మనసుతోనే అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. ఈ విషయంలో ఆమె దుష్యంతుడినిగానీ ... దైవాన్నిగానీ ... కాలాన్నిగాని నిందించదు.

కాలం అనుకూలించే వరకూ సహనంతో ఎదురుచూస్తూ ఉండటమే సరైనదని శకుంతల భావిస్తుంది. భగవంతుడిపై భారంవేసి రోజులు గడుపుతూ వుంటుంది. నదీ ప్రయాణ సమయంలో శకుంతల పోగొట్టుకున్న ఉంగరం ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరి వలకి చిక్కడంతో, దాని కడుపులోని ఉంగరం ఆ జాలరికి దొరుకుతుంది. దానిని అమ్మడానికి అతను ప్రయత్నించగా అది దుష్యంత మహారాజుకి చేరుతుంది.

ఆ ఉంగరం చూసినప్పుడే అతనికి శకుంతల గుర్తుకు వస్తుందనేది దూర్వాసుడు చెప్పిన శాపవిమోచనం. అందువలన దానిని చూడగానే దుష్యంతుడికి గతమంతా కనులముందు కదలాడుతుంది. శకుంతల మనసుకి కష్టం కలిగించినందుకు ఆయన ఎంతగానో బాధపడతాడు. అతికష్టం మీద శకుంతల ఆచూకీ తెలుసుకుని, ఆమెతో పాటు కుమారుడైన భరతుడిని వెంటబెట్టుకుని తన అంతఃపురానికి చేరుకుంటాడు.


More Bhakti News