స్వప్నం ద్వారా అనుగ్రహించే బాబా

తనని విశ్వసిస్తోన్నవారిని తాను సదా కనిపెట్టుకునే వుంటానని శిరిడీ సాయిబాబా సెలవిచ్చాడు. ఆ మాటకి కట్టుబడే ఆయన తన భక్తులను కరుణిస్తూ ... కాపాడుతూ వస్తున్నాడు. ఆపదల నుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి ... అనారోగ్యాల నుంచి బాబా కాపాడుతూ ఉంటాడని ఆయన భక్తులు భావిస్తుంటారు. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలను చూపుతుంటారు.

ఈ నేపథ్యంలో బాబా స్వప్న సాక్షాత్కారానికి ... ప్రత్యక్ష దర్శనానికి తేడా లేకపోవడం ఆయన భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ వుంటుంది. స్వప్నంలో బాబా కనిపించడం ... అది కలే కదా అనుకుంటే ఆయన నిజంగానే వచ్చిన ఆనవాళ్లు కనిపించడమనేది చాలామంది భక్తుల విషయంలో జరిగింది. ఒక భక్తురాలు అనారోగ్యంతో బాధపడుతూ వుంది. వ్యాధి బాగా ముదిరిపోయిందనీ, ఇక చికిత్సకి లొంగదని గ్రహించిన వైద్యులు పట్నంలోని పెద్ద ఆసుపత్రికి ఆమెని పంపిస్తారు.

అక్కడి వైద్యులు మరునాడు ఉదయం నుంచి ఆమెకి పరీక్షలు చేయడం ఆరంభిస్తామని చెబుతారు. తనని ఈ వ్యాధి బారి నుంచి కాపాడమని ఆ భక్తురాలు బాబాకు మొరపెట్టుకుంటుంది. ఆ రాత్రి స్వప్నంలో ... విషం ఒక ప్రవాహంలా ఆమె వైపుకి దూసుకురాసాగిందట. ఆమె బాబా అని ఆర్తితో పిలవడంతో, ఆయన వెంటనే ఆ ప్రవాహానికి తన చేతిని అడ్డుగా వుంచి ఆపడమే కాకుండా, ఆమె నుదుటున విభూతి పెడతాడు తానుండగా ఆమెకి వచ్చిన భయం లేదని చెబుతాడు.

అది కలేననుకున్న ఆమె తన నుదుటున విభూతి దిద్దబడి వుండటం చూసుకుని ఆశ్చర్యపోతుంది. ఆమెని పరీక్షించిన వైద్యులు, వ్యాధి తీవ్రత తాము అనుకున్నంతగా లేదనీ ... కొన్ని రోజులపాటు మందులువాడితే సరిపోతుందని చెప్పి పంపించి వేస్తారు. తనని కాపాడింది బాబాయేనని గ్రహించిన ఆ భక్తురాలు ఆనందంతో పొంగిపోతుంది. మరో భక్తుడికి కూడా బాబా ఇలాగే స్వప్నంలో కనిపిస్తాడు. బాబా తనకి చేసిన మేలుకి గాను ఆ భక్తుడు స్వప్నంలో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అక్షింతలతో తనని ఆశీర్వదించమని ఆయనని కోరతాడు.

భక్తుడి మాట కాదనలేక బాబా అలాగే చేస్తాడు. మెలకువ వచ్చిన తరువాత అది స్వప్నమే అయినందుకు ఆ భక్తుడు నిరాశ చెందుతాడు. అయితే ఆ పక్కనే కొన్ని అక్షింతలు పడి వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఇలా బాబాను స్వప్నంలో దర్శించామనుకున్న భక్తులు, ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులను అందుకున్నారు ... అనుగ్రహాన్ని పొందారు.


More Bhakti News