సాయినాథా అని పిలిస్తే చాలు

శిరిడీలోని మశీదులో వున్న సమయంలో కొందరు బాబాకి అనుకూలంగా ... మరికొందరు ప్రతికూలంగా వుండేవారు. ఆయన తనని ఆదరించినవారిని ఆదుకుంటూ ... తనని ద్వేషించేవారిని క్షమిస్తూ ఉండేవాడు. అవమానపరచాలనే ఉద్దేశంతో వచ్చినవారిని సైతం అభిమానపూర్వకంగా పలకరిస్తూ ఉండేవాడు. బాబాలోని ఈ స్వభావమే ఇతరులలోని ఈర్ష్యా .. అసూయ .. ద్వేషాలను చెరిపేసింది. కొంతమంది అహంభావాన్ని తుడిచేసింది.

దాంతో ఆత్మీయతానురాగాలతో కూడిన సామ్రాజ్యంగా శిరిడీ గ్రామం విస్తరించింది. బాబా అన్ని మతాలవారిని ఒక గొడుగు కిందికి చేర్చాడు. అందరూ తమ దైవాన్ని తనలో చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించాడు. కష్టమొచ్చినా ... నష్టమోచ్చినా బాబా వున్నాడనే ధైర్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారందరికీ వుండేది. ఇప్పుడు ఇదే ధైర్యం దేశవిదేశాల్లో గల ఆయన భక్తులందరికీ వుంది.

బాబా ఇప్పుడు ప్రతి ఊళ్లోనూ ... ప్రతి ఇంటిలోను ... ప్రతి హృదయంలోను దైవస్వరూపంగా కనిపిస్తూ వుంటాడు. కోరిన వరాలను అందిస్తూ వుంటాడు. అలా బాబా కొలువైన ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా 'హుజూర్ నగర్' లో కనిపిస్తుంది. పాత బస్టాండ్ సమీపంలో గల ఈ ఆలయం, బాబాపట్ల ఇక్కడివారికి గల భక్తివిశ్వాసాలకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ప్రతి గురువారం బాబాను దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

బాబా అభిషేకంలోను ... హారతుల్లోను భక్తులు పాల్గొంటూ వుంటారు. బాబాకి నిర్వహించే ప్రత్యేక సేవల్లోను ... భజనల్లోను తరిస్తుంటారు. ఇక్కడి బాబాను దర్శించుకోవడం వలన ఆపదలు తొలగిపోతాయని చెబుతారు. ఆయనని విశ్వసించినవారి చెంతకు ఎలాంటి సమస్యలు రావనీ, దుఃఖమనేది తన భక్తులకు దూరంగా ఉండేలా బాబా చూసుకుంటాడని అంటారు. అందుకు నిదర్శనంగా తమ అనుభవాలనే ఆవిష్కరిస్తూ వుంటారు. తమపాలిట కల్పవృక్షం బాబాయేననే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News