తాజా పుష్పాలతోనే దేవతార్చన
పూజ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి పువ్వులు. దైవదర్శనానికి ఆలయానికి వెళ్లాలనుకున్నా, పూజామందిరం దగ్గర కూర్చోవాలన్నా అందరూ ముందుగా ఏర్పాటు చేసుకునేవి పువ్వులే. అవి లేకుండా చేసేది పూజనే కాదు ... ఒకవేళ చేసినా దాని వలన ఎలాంటి ప్రయోజనము లేదు. భగవంతుడిని వివిధరకాల పువ్వులతో అలంకరించినప్పుడు కలిగే ఆనందం వేరు. వివిధరకాల పువ్వులతో పూజించినప్పుడు కలిగే అనుభూతి వేరు.
అందుకే మహాభక్తులు దేవతార్చన కోసం పూలతోటలు పెంచేవారు. ఆ తోటలోని తాజా పూలతో అపురూపంగా ఆ స్వామి పాదాలను పూజించేవారు. భగవంతుడికి సమర్పించే పువ్వుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే భక్తులు ఇప్పటికీ వున్నారు. ఒక్కోరకం పూలతో ... ఒక్కో వర్ణంగల పువ్వులతో పూజించినప్పుడు కలిగే ఫలితం ఒక్కో విధంగా ఉంటుందని చెప్పబడుతోంది.
ఈ నేపథ్యంలో కొంతమంది ముందురోజునే పువ్వులను కొనుగోలు చేసి దాచి, మరుసటి రోజున వాటిని పూజకు ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా నిల్వచేసిన పువ్వులు వడలిపోవడమే కాకుండా, సహజసిద్ధమైన సువాసనను కోల్పోతాయి. ఇలాంటి పువ్వులను పూజకు ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. దైవానికి సమర్పించే పువ్వులు ఆ రోజున ... అప్పుడే వికసించినవై వుండాలి.
వాసనలేని పువ్వులనుగానీ ... నిల్వ ఉంచిన పువ్వులనుగాని కాకుండా, తాజా పువ్వులతో మాత్రమే దైవాన్ని అర్చించాలి. తాజా పువ్వులతో దేవతార్చన జరపడం వలన కలిగే ఫలితం విశేషంగా ఉంటుంది. ఇక పువ్వులు ఎంత తాజాగా ఉండాలో ... మనసు కూడా అంతటి పవిత్రం చేసుకుని పూజచేయాలి. మనసుని కూడా ఒక పుష్పంగా భావన చేసుకుని దానిని భగవంతుడి పాదాల చెంత ఉంచాలి. ఈ విధంగా చేసే పూజ వలన ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయనీ, సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.