ప్రార్ధనచేస్తే ప్రాణంపోసిన భగవంతుడు

భగవంతుడి నామాన్ని స్మరించడంలోను ... ఆయన లీలావిశేషాలను కీర్తించడంలోనే అసలైన ఆనందం ఉందనే విషయాన్ని ఈ లోకానికి చాటిన మహాభక్తులు ఎంతోమంది వున్నారు. భగవంతుడిని క్షణాల్లో రప్పించగలిగే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లు ఆయన నుంచి సిరిసంపదలు కోరలేదు. ఇతరుల దుఃఖాన్ని చూడలేక .. వాళ్లను కాపాడమనే ఆ స్వామికి చెప్పుకునేవారు. ఆయన అనుగ్రహంతో నిస్సహాయులకు తమవంతు సహాయ సహకారాలను అందించేవారు.

ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ వుంటాయి. శివభక్తులలో ముందువరుసలో కనిపించే 'తిరుజ్ఞాన సంబంధర్' ఒకసారి ఒక గ్రామం మీదుగా వెళుతూ, హృదయ విదారకంగా రోదిస్తోన్న దంపతులను చూస్తాడు. వారి ఒక్కగానొక్క కూతురు మరణించిందని తెలుసుకుంటాడు. ఆ దంపతుల దుఃఖాన్ని చూడలేక, పరమశివుడిని ప్రార్ధించి ఆ స్వామి అనుగ్రహంతో ఆ అమ్మాయిని బ్రతికిస్తాడు.

తులసీదాస్ కూడా అంతే ... రామనామ స్మరణచేస్తూ ఆ దారిన వెడుతోన్న ఆయన, ఒకవ్యక్తి పార్థివ శరీరాన్ని స్మశానానికి తరలిస్తూ ఉండటాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి భార్య కన్నీళ్లు తులసీదాస్ మనసును కదిలించివేస్తాయి. దాంతో ఆమె భర్తకి ప్రాణభిక్ష పెట్టమని ఆయన ఆ రాముడిని ప్రార్ధిస్తాడు. భక్తుడి మనసును అర్థంచేసుకున్న భగవంతుడు ఆ స్త్రీకి అయిదవతనాన్ని ప్రసాదిస్తాడు.

అలాగే త్యాగయ్య కూడా ఒక గ్రామంలో గల ఆలయానికి వెళ్లినప్పుడు, అక్కడ ఒక స్త్రీ .. ఆమె పిల్లలు దుఃఖిస్తూ వుండటం ఆయన కంటపడుతుంది. ఆ ఆలయంలో గల బావిలో పడి ఆమె భర్త మరణించాడని తెలుసుకున్న త్యాగయ్య, ఆ దీనురాలి దుఃఖాన్ని దూరం చేయమని రాముడిని కోరతాడు. చనిపోయిన ఆ వ్యక్తి త్యాగయ్య అభ్యర్థన ఫలితంగా బ్రతుకుతాడు.

ఇక ఒకానొక సందర్భంలో జయదేవుడి భార్య మరణిస్తుంది. అనునిత్యం ఆ కృష్ణ భగవానుడిని కీర్తించే జయదేవుడు, తన ఆవేదనను ఆ స్వామి పాదాల చెంత వ్యక్తం చేస్తాడు. ఫలితంగా జయదేవుడి భార్య బ్రతుకుతుంది. ఇలా ఎంతోమంది భక్తులు ... చనిపోయినవారిని ఆ భగవంతుడి అనుగ్రహంతో బ్రతికించారు. భగవంతుడితో భక్తులకి గల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.


More Bhakti News