లక్ష్మీదేవిని ఇలా ఆహ్వానించాలి

కొంతమంది ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లు చాలా నిరాడంబరంగా ఉంటోన్న విషయం అర్థమైపోతూ వుంటుంది. ఆ ఇల్లు పరిశుభ్రంగా వుండటం వలన ... పూజామందిరం చక్కగా అలంకరించి వుండటం వలన పవిత్రంగా అనిపిస్తుంది. అతిథులను ఆహ్వానించడంలోను ... వాళ్లని ఆదరించడంలోనే భార్యాభర్తల మధ్యగల అవగాహన తెలిసిపోతుంది.

ఆ దంపతులు ఎలాంటి గొప్పలు మాట్లాడకుండా ... తమ కష్టనష్టాలను గురించి ప్రస్తావించకుండా సంతోషంగా వుంటారు. తమకి ఏదైతే వుందో అది ఆ భగవంతుడు ప్రసాదించినదిగానే చెబుతారు. అలాంటివాళ్లు మాట్లాడుతూ వుంటే మరికొంతసేపు అక్కడ ఉండాలనిపిస్తుంది. ఇక మరికొంతమంది ఇళ్లకి వెళ్లినప్పుడు .. తమ గొప్పలు చెప్పుకునేవాళ్లు కనిపిస్తుంటారు. తమ స్థాయికి తగినవాళ్లని మాత్రమే వాళ్లు గౌరవిస్తుంటారనే విషయం అనుభవంలోకి వస్తుంది.

వాళ్ల మాటలు ... చేష్టలు అహంభావానికి అద్దంపడుతుంటాయి. అతిథులుగా వచ్చినవారిముందే ఆ దంపతులు మాటామాట అనుకుంటూ వుంటారు. వచ్చినవాళ్లకి అది ఇబ్బందిని కలిగిస్తుంది కనుక, సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడిపోతుంటారు. ఇలా గొడవలు పెట్టుకునే ఇంట్లో ఇతరులు ఎలా వుండలేరో, లక్ష్మీదేవి కూడా అలాగే ఉండలేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సుఖదుఃఖాలనేవి అందరి జీవితంలోకి తొంగిచూసి వెళుతుంటాయి. వాటికి అంతటి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఏ ఇంట్లోని వారైతే ఎప్పుడూ సంతోషంగా ఉంటారో, ఆ ఇంట్లో ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపుతుందని చెప్పబడుతోంది.

ఏ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో, తాత్కాలికమైన విషయాలను గురించి విచారాన్ని పొందుతుంటారో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని స్పష్టం చేయబడుతోంది. అందువలన ఎప్పుడూ సంతోషంగా ఉండటానికీ ... సంతృప్తితో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ వుండాలి. అలా చేస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News