శనిదోషాన్ని తొలగించే రుద్రాక్ష !
రుద్రాక్ష ధారణ పరమశివుడికి ప్రీతిని కలిగిస్తుంది. ఆయన అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. ఒక్కోరకమైన రుద్రాక్ష ఒక్కో విశేషమైన గుణాన్ని కలిగివుంటుంది. అలా శనిదోష ప్రభావాన్ని తగ్గించే శక్తిని కలిగిన రుద్రాక్షగా 'సప్తముఖి' రుద్రాక్ష చెప్పబడుతోంది. సవ్యంగా ... సాఫీగా సాగిపోతోన్న జీవితాన్ని శని ఎంతగానో ప్రభావితం చేస్తాడు. ఎవరి సాయం అందకుండా ... ఆశించిన ప్రయోజనాలు నెరవేరకుండా అన్ని రకాలుగాను అవస్థలపాలు చేస్తాడు.
అందుకే శనిపేరు వినగానే అందరి మనసులోనూ అలజడి మొదలవుతుంది. అలాంటి శనిదోష ప్రభావం నుంచి బయటపడటానికి ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 'సప్తముఖి రుద్రాక్ష' ను ధరించడం ఒక మార్గంగా చెప్పబడుతోంది. లక్ష్మీదేవి స్వరూపంగాను ... మన్మథ స్వరూపంగాను, సప్తమాతృకలు ... సప్తరుషులకు ప్రతీకగాను ఈ రుద్రాక్షను చెబుతుంటారు. అలాంటి ఈ రుద్రాక్ష పాలకుడు శనిదేవుడే.
అందుకే ఈ రుద్రాక్షను ధరించడం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది. ఈ రుద్రాక్షను ధరించడం వలన శనిప్రభావం నుంచి మాత్రమే కాకుండా, ప్రమాదాల బారినుంచీ ... విష బాధల నుంచి ... దారిద్ర్యం నుంచి బయటపడటం జరుగుతుందని స్పష్టం చేయబడుతోంది. అయితే రుద్రాక్ష ఏదైనా నియమ నిష్ఠలను పాటిస్తూ దానిని పవిత్రంగా చూసుకున్నప్పుడే అది ఆశించిన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.