రామనామ స్మరణతో లభించే రక్షణ
దశరథరాముడు ... సాకేతరాముడు ... సీతారాముడు ... ఇలా ఎన్నోపేర్లతో రాముడిని పిలుస్తుంటారు. అపారమైన భక్తిశ్రద్ధలతోనే కాదు ... అనంతమైన ప్రేమానురాగాలతో రాముడిని కొలుస్తుంటారు. రాముడిని ప్రత్యక్షంగా సేవించిన హనుమంతుడు ... ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని భావించిన హనుమంతుడు ఆయన నామాన్ని ఒక వరంలా స్వీకరించాడు. రాముడి అనుగ్రహం ఆయన నామస్మరణ వలన తేలికగా లభిస్తుందని ఈ ప్రపంచానికి చాటిచెప్పాడు.
రామనామ మహిమ కారణంగానే సీతాన్వేషణ సమయంలో తాను సముద్రాన్ని దాటినట్లు హనుమంతుడు సెలవిచ్చాడు. వారధి నిర్మాణంలో రామనామానికిగల మహిమ కారణంగానే సముద్రంలో పడవేసిన రాళ్లు పైకి తేలాయి. రామనామ మహిమ కారణంగానే దారిదోపిడీలు చేసే రత్నాకరుడు వాల్మీకీ మహర్షిగా మారాడు. ప్రజలను ఆదర్శవంతమైన మార్గంలో నడిపించడం కోసం ఈ లోకానికి రామాయణ మహా కావ్యాన్ని అందించాడు.
పోతన .. త్యాగయ్య ... తులసీదాస్ ... కబీరుదాసు ... రామదాసు ఇలా ఎంతోమంది భక్తులు రామనామ స్మరణతో మోక్షాన్ని సాధించారు. రామనామం చెడుఆలోచనలను తొలగిస్తుంది. అంతర్గతంగా వుండే హింసా ప్రవృత్తిని నశింపజేస్తుంది. మానసికపరమైన ఆందోళనతో సతమతమైపోతోన్నవారికి దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. అనేక కష్టాల నుంచీ ... బాధల నుంచి విముక్తులను చేస్తుంది. వెంటాడుతూ వస్తోన్న పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలను అందిస్తుంది.
ఇలా రామనామాన్ని ఎవరైతే స్మరిస్తూ వుంటారో, అది వాళ్లకి ఒక రక్షణ వలయంగా మారి రక్షిస్తూ వుంటుంది. ఆపదల నుంచి ... ఆవేదనల నుంచి కాపాడుతూ వుంటుంది. దుఃఖానికి దూరంచేసే రామనామాన్ని సదా స్మరిస్తూ వుండాలి. ఆ రామచంద్రుడి అనుగ్రహంతో సకలశుభాలను పొందుతూ వుండాలి.