అభయాన్నిచ్చే ఆంజనేయుడు
ఎంతోమంది భక్తులు హనుమంతుడిని ఆరాధిస్తూ వుంటారు. ఆ స్వామి దీక్షను ధరించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ప్రతి మంగళవారం ఆ స్వామికి ప్రదక్షిణలు చేస్తుంటారు ... ఆకుపూజలు జరిపిస్తుంటారు. హనుమంతుడికి ఇష్టమైన వడమాలలు సమర్పిస్తూ వుంటారు. హనుమంతుడి పట్ల అపారమైన విశ్వాసంగల భక్తులు ఆ స్వామికి అవసరమైన ఆభరణాలు ... కానుకలు సమర్పిస్తూ వుంటారు.
ఇక కొంతమంది భక్తులు బృందంగా ఏర్పడి ఆయనకి ఆలయాన్ని నిర్మిస్తూ వుంటారు. అలా నిర్మించబడిన హనుమంతుడి ఆలయాలలో ఒకటి మచిలీపట్నం - సుల్తాన్ నగర్ లో కనిపిస్తుంది. ఇక్కడి స్వామి 'అభయాంజనేయుడు' గా దర్శనమిస్తూ వుంటాడు. హనుమంతుడిని ఆరాధించే ఇక్కడి భక్తులు అనునిత్యం ఆ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు.
అలా చాలాకాలం క్రితమే ఇక్కడ కొలువైన హనుమంతుడుకి అనూహ్యమైన రీతిలో ఆదరణ పెరుగుతూ వచ్చింది. అనతికాలంలోనే అశేష భక్త జనవాహినిచే స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. అందుకు కారణం భక్తులకు నిదర్శనం కనిపిస్తూ ఉండటమే. అభయాంజనేయస్వామి పాదాలను ఆశ్రయించడం వలన ఆయన అండదండలు లభిస్తాయని అంటారు. భయాందోళనలు దూరంచేసి, కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడని చెబుతారు.
మంగళవారాల్లో స్వామివారిని దర్శించుకుని ఆయనకి పూజలు జరిపించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక విశేషమైన రోజుల్లోనూ ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రం, భక్తుల విశ్వాసానికీ ... హనుమంతుడి అనుగ్రహానికి ప్రతీకగా దర్శనమిస్తూ వుంటుంది ... ధన్యులను చేస్తూ వుంటుంది.