పాండవులకు ఘటోత్కచుడి సహకారం

పాండవులను అరణ్యవాసానికి పంపించిన కౌరవులు, అక్కడ కూడా వాళ్లకు అనేకరకాల ఆపదలను కలిగిస్తుంటారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన శ్రీకృష్ణుడు, ప్రతిక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలనీ, ప్రతి రాత్రివేళ నిద్రపోకుండా కాపలా వుండాలని భీముడిని హెచ్చరిస్తాడు. అలా వుండటం వల్లనే లక్కాగ్రుహ దహనం నుంచి పాండవులు బయటపడతారు. ఆ తరువాత ఒకసారి మిగతావారికి భీముడు కాపలాగా వున్న సమయంలో అతనిపైకి 'హిడింబా సురుడు' విరుచుకుపడతాడు. ఆ రాక్షసుడిని భీముడు సంహరిస్తాడు.

హిడింబాసురుడి ఆర్తనాదం విన్న ఆ రాక్షసుడి సోదరి 'హిడింబి' ఆగ్రహావేశాలతో ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. తన సోదరుడిని సంహరించిన భీముడి పరాక్రమం ఆమెని ఆకట్టుకుంటుంది. ఆమె స్వభావం పట్ల ఆకర్షితుడైన భీముడు కూడా ప్రేమానురాగాలను ప్రకటిస్తాడు. అలా భీముడికి దగ్గరైన హిడింబి ఆయన వలన ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. హిడింబి - భీముడికి కలిగిన ఆ పుత్రుడే 'ఘటోత్కచుడు'.

ఇతను మహాబల సంపన్నుడు ... ఎంతటి పరాక్రమవంతులైనా అతణ్ణి ఎదిరించి నిలువలేరు. తండ్రి నుంచి సహజంగా లభించిన బాహుబలం ... తల్లి నుంచి నేర్చుకున్న చిత్ర విచిత్రమైన విద్యలు అతనికి రక్షణ కవచంగా వుంటాయి. అంతటి పరాక్రమం కలిగిన ఘటోత్కచుడు, తలచుకున్నప్పుడు వస్తానని తండ్రికి మాట ఇస్తాడు. తన తండ్రి భీముడి పట్ల వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఆయన ఆదేశాన్ని పాటిస్తూ ఉండేవాడు. పాండవులకు కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఘటోత్కచుడు వాళ్లను రక్షించాడు. వాళ్లు సాధించిన విజయాలలో పాలుపంచుకున్నాడు.


More Bhakti News