భక్తుల మనసు భగవంతుడికి తెలుసు
మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే ... వాళ్లు భగవంతుడి సేవను తప్ప మరేమీ ఆశించకపోవడం కనిపిస్తుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా ... ఇబ్బందులు ఎదురైనా వాళ్లు భగవంతుడి సేవకి దూరంకాకుండా చూసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడే కదిలివచ్చేలా చేసుకున్నారు. అలాంటి మహాభక్తుల జాబితాలో ఎంతోమంది కనిపిస్తుంటారు.
సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళదామనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు అడ్డుపడుతూ వుంటాయి. అలాంటప్పుడు అయ్యో ఆ భగవంతుడి దర్శనం చేసుకోలేకపోయామేననే బాధకలుగుతూ వుంటుంది. అలాంటి బాధను 'సక్కుబాయి' కూడా అనుభవిస్తుంది. తన దర్శనభాగ్యం కోసం ఆమె అంతగా తపిస్తూ వుండటం ఆ భగవంతుడిని కదిలిస్తుంది. ఆమె పండరీపురం వెళ్లడానికి ఆటంకం ఏర్పడితే, ఆ స్వామి మారువేషంలో వచ్చి సక్కుబాయిని దగ్గరుండి ఆ క్షేత్రానికి పంపిస్తాడు.
ఇక 'జనాబాయి' విషయానికి వస్తే ఆమె కూడా ఆ పాండురంగస్వామికి మహాభక్తురాలు. ఒకానొక సందర్భంలో ఆమె ఆ స్వామితో కలిసి భోజనం చేయాలని ఆశపడుతుంది. జనాబాయి మనసు తెలుసుకున్న స్వామి ఆమెకి ఆ అదృష్టాన్ని కలిగిస్తాడు. స్వామితోపాటు భోజనం చేసిన జనాబాయి తన జీవితం ధన్యమైపోయినట్టుగా భావిస్తుంది. ఇక తిరుమల శ్రీనివాసుడిని తరిగొండ వెంగమాంబ ఎంతగానో ఆరాధిస్తుంది. అయితే ఆ స్వామిని సేవించుకోవడంలో ఆమె కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటూ వుంటుంది. దాంతో ఆమె తీవ్రమైన మనోవేదనకి లోనవుతుంది.
వెంగమాంబ ఆవేదనను అర్థంచేసుకున్న స్వామి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా తనని సేవించుకునే అవకాశాన్ని ఆమెకి కలిగిస్తాడు. ఇలా భగవంతుడు తన భక్తుల మనసు తెలుసుకుంటూ ... అందుకు తగిన విధంగా వాళ్లను అనుగ్రహిస్తూ వుంటాడు. భగవంతుడికీ ... భక్తులకి మధ్యగల అనుబంధానికి ఇలాంటి సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.