హనుమంతుడిని మెప్పిస్తే చాలు !
శ్రీరాముడి సేవయే తన జీవితానికిగల పరమార్థమని హనుమంతుడు విశ్వసిస్తాడు. రామనామాన్ని స్మరించని సమయం ... రాముడి సేవ చేయని క్షణం వృథా అయినట్టుగా భావిస్తాడు. చిరంజీవిగా వరాన్ని పొందిన హనుమంతుడు, శ్రీరాముడి రూపాన్ని మనోఫలకంపై ప్రతిష్ఠించుకుని అనుక్షణం ఆరాధిస్తూ వుంటాడు. రాముడిని చూడకుండా ఆయన క్షణకాలమైనా ఉండలేడు. రాముడు ఎక్కడ వున్నా ఆయన సేవకుడిగా అక్కడ హనుమంతుడు ఉంటాడు.
అందుకే ప్రతి రామాలయంలోను ఆయన ఎదురుగా హనుమంతుడు దర్శనమిస్తూ వుంటాడు. ఇక రాముడికి సంబంధించిన ఉత్సవాల్లో హనుమంతుడి వాహనానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ ఉత్సవాలకి నిజంగానే హనుమంతుడు వస్తాడని చాలా ప్రాంతాలలోని భక్తులు భావిస్తుంటారు. రాముడిని కీర్తిస్తూ జరిగే భజనలకు ఆయన ఏదో ఒకరూపంలో తప్పనిసరిగా వస్తాడని విశ్వసిస్తుంటారు. అది నిజమేననడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తులసీదాస్ అనేక ప్రాంతాలలో తిరుగుతూ రామనామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికి ఒక వృద్ధుడు తప్పనిసరిగా వస్తూ వుండటం ఆయన గమనిస్తాడు. రామనామం వినగానే తనని తాను మరిచిపోయే ఆ వృద్ధుడి తన్మయత్వం చూసిన తులసీదాస్ ఆయన హనుమంతుడని భావించి పాదాలను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆయనకి నిజరూపంలో హనుమంతుడు దర్శనమిస్తాడు. రామనామ సంకీర్తనంతో తనని ఆనందింపజేసినందుకు అభినందిస్తాడు.
తులసీదాస్ మనసు తెలుసుకుని ఆయనకి ఆ శ్రీరామచంద్రుడి దర్శనభాగ్యం లభించేలా చేస్తాడు. రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని చెప్పడానికీ, హనుమంతుడి పాదాలను ఆశ్రయించిన వారికి ఆ రామచంద్రుడి అనుగ్రహం లభిస్తుందని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.