పరిపూర్ణమైన అనుగ్రహం ఇలా దక్కుతుంది
జీవితంలో అనుకోని సమస్యలు ఎదురవుతూ వుంటాయి ... ఊహించని కష్టాలు పలకరిస్తూ వుంటాయి. అనారోగ్యాలు బయటపడుతూ ఆందోళనను కలిగిస్తూ వుంటాయి. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఈ బాధల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోవడం జరుగుతూ వుంటుంది. తెలిసీతెలియక చేసిన పాపాల ఫలితాలే వివిధ రూపాల్లో వెంటాడుతూ వుంటాయి. అలాంటి పాపాల నుంచి విముక్తిని ప్రసాదించేది శివనామస్మరణమే.
శివ అనే రెండు అక్షరాలు స్మరిస్తేచాలు పరమశివుడు కదిలిపోతాడు ... ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపిస్తేచాలు కరిగిపోతాడు. అందుకే శివుడి పాదాలను అందరూ ఆశ్రయిస్తుంటారు. ఒక్కో పదార్ధంతో చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కోవిశేషమైన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. అలాగే ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకాన్ని జరపడం వలన ఒక్కో పుణ్యఫలం చేకూరుతుందని స్పష్టం చేయబడుతోంది.
ఈ విధంగా జరిపే పూజల వలన ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. అయితే విభూతి ధారణచేసి ... రుద్రాక్షలు ధరించిచేసే పూజాభిషేకాల వలన ఫలితం మరింత విశేషంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి హోమగుండం ద్వారా ... ఆవుపేడతో చేయబడిన పిడకలు కాల్చడం వలన వచ్చే మెత్తటి పదార్థాన్ని విభూతి అని అంటారు. అలాంటి విభూతి ఎంతో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.
ఇక రుద్రాక్షల విషయానికివస్తే, ఇవి విశేషమైన గుణాలను కలిగివుంటాయి. ఆరోగ్యపరంగాను ... ఆధ్యాత్మిక పరంగాను వీటి ధారణ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. విభూతి ధారణ వలన దుఃఖాలు దూరమవుతాయి. రుద్రాక్ష ధారణ వలన అనేక దోషాలు నివారించబడతాయి. విభూతి ధారణ ... రుద్రాక్ష ధారణ ఇంతటి విశిష్టతను సంతరించుకోవడానికి కారణం, పరమశివుడి అనుగ్రహం వాటియందు నిక్షిప్తమై ఉండటమే. అలాంటివాటిని ధరించి చేసిన పూజాభిషేకాలు ఆదిదేవుడికి మరింత సంతృప్తిని కలిగిస్తాయనీ, పరిపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని స్పష్టం చేయబడుతోంది.