శాప ఫలితాన్ని అనుభవించవలసిందే !

శ్రీమన్నారాయణుడిని వివాహం చేసుకోవాలని వేదవతి నిర్ణయించుకుంటుంది. ఆ స్వామిని భర్తగా పొందడమే తన జన్మకి సార్ధకమని అనుకుంటుంది. నారాయణుడి మనసు గెలుచుకోవాడానికి తపస్సును మించిన సాధనలేదని భావిస్తుంది. అనుకున్నదే తడవుగా నిర్జన ప్రదేశానికి చేరుకొని తపోదీక్షను చేపట్టి, ఆ స్వామిని గురించి కఠోర తపస్సును చేయడం ఆరంభిస్తుంది.

అలా ఆమె తపస్సు కొనసాగుతోన్న సమయంలో, పుష్పక విమానంలో విహరిస్తూ రావణుడు అటుగా వస్తాడు. తపోదీక్షలో గల వేదవతిని చూస్తాడు. ఆమె సౌందర్యం అతణ్ణి మంత్రముగ్ధుడిని చేస్తుంది. ఎలాగైనా ఆమెను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దగ్గరికి వస్తాడు. వేదవతి తపోదీక్షకు భంగం కలిగిస్తూ తన మనసులోని మాటను బయటపెడతాడు.

అతని ధోరణిపట్ల వేదవతి తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తుంది. తనని తాకడానికి ప్రయత్నించినా అందుకు తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తుంది. ఆ మాటలను రావణుడు పెద్దగా పట్టించుకోకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడు. దాంతో వేదవతి ఆగ్రహావేశాలకి లోనవుతుంది. స్త్రీకి గల ఉన్నతమైన స్థానాన్ని అర్థంచేసుకోకుండా తనని అవమానించినందు వలన, స్త్రీ కారణంగానే పరివారంతో సహా అతను నశిస్తాడని శపిస్తుంది. రావణుడు చూస్తుండగానే యోగాగ్నిని సృష్టించుకుని అందులోకి ప్రవేశిస్తుంది. వేదవతి శాపం రావణుడిని వెంటాడుతుంది ... సీత కారణంగా ఆయన పరివారంతో సహా నశించేలా చేస్తుంది.


More Bhakti News