గంగమ్మతల్లే స్వామిని అభిషేకిస్తుందట !
పుణ్యక్షేత్రాలు అనేక విశేషాలకు ... మహిమలకు నిలయాలుగా కనిపిస్తూ వుంటాయి. ఆ విశేషాలను గురించి తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు ... అనుభూతివేరు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలలో 'కొప్పోలు' ఒకటిగా కనిపిస్తుంది. మెదక్ జిల్లా పరిధిలోగల ఈ క్షేత్రంలో 'ఉమా సంగమేశ్వరుడు' పేరుతో స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.
శ్రావణమాసంలో ఏదో ఒక రోజున ఈ గర్భాలయంలోకి భూగర్భం నుంచి నీరు ఉబికి వచ్చి శివలింగాన్ని స్పర్శించడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. కొన్ని శైవ క్షేత్రాలలో స్వామివారి గర్భాలయంలోకి నీళ్లు రావడం, కొన్నిరోజుల తరువాత ఆ నీళ్లు తగ్గుముఖం పడుతూ అదృశ్యం కావడం జరుగుతూ వుంటుంది. మరికొన్ని క్షేత్రాల్లో స్వామివారిని అభిషేకించిన నీళ్లు గర్భాలయం నుంచి బయటికిరాకుండా అక్కడే అదృశ్యమవుతూ వుంటాయి.
ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ... ఎక్కడికి పోతున్నాయో అంతుచిక్కకపోవడం విచిత్రంగా ... మహిమగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఇక ఈ క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి వచ్చిన నీళ్లు కొంతసేపటి తరువాత అదృశ్యమవుతాయని చెబుతారు. ఈ నీళ్లు కూడా ఎలా వస్తున్నాయో ... ఆ తరువాత ఏమైపోతున్నాయో ఎవరికీ తెలియదు. గంగమ్మ తల్లే స్వామివారిని అభిషేకించడం కోసం ... ఆ స్వామి స్పర్శతో తరించడం కోసం ఇలా వస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు.
అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసే భాగ్యం దక్కిన భక్తులు తమ జన్మధన్యమైందని భావిస్తుంటారు. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, అందుకే ఈ మహిమ జరుగుతూ వస్తోందని అంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.