అదే పరమేశ్వరుడికి పరమానందం

అభిషేకం చేస్తే ఆదిదేవుడు ఆనందిస్తాడు ... నైవేద్యాన్ని సమర్పిస్తే పొంగిపోతాడు. ఇక నైవేద్యాన్ని తప్పక స్వీకరించవలసిందేనంటూ పట్టుబడితే, తనపట్ల గల ప్రేమకి మురిసిపోతాడు. ఇలా అసమానమైన తమ భక్తితో ఆయనని రప్పించిన భక్తులు లేకపోలేదు.

'తిన్నడు' (కన్నప్ప) శివలింగాన్నే ప్రత్యక్ష శివుడిగా భావిస్తాడు. అంతకాలంగా అడవిలో పడివున్న దేవుడు ఎంత ఆకలితో ఉన్నాడోననే బాధతో తల్లడిల్లిపోతాడు. అడవిలో దొరికే తేనె .. పండ్లు తీసుకువచ్చి శివలింగం ముందుంచి, తిని తీరవలసిందేనని మొండికేస్తాడు. అమాయకత్వంతో నిండిన ఆయన భక్తికి సదాశివుడు సంతోషిస్తాడు. తిన్నడు సమర్పించిన ఆహారాన్ని ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు.

ఇక శివుడికి తనచేత్తో అన్నం తినిపించాలనే కోరికతో వుంటాడు మంజునాథుడు. స్వామిని ప్రత్యక్షంగా దర్శించాలి ... తన చేత్తో ఆయనకి అన్నం తినిపించాలి. అప్పుడే తన జీవితం ధన్యమవుతుదని భావించేవాడు. మంజునాథుడి భక్తిశ్రద్ధలకు కరిగిపోయిన శివుడు ఆయన ముచ్చటతీరుస్తాడు. ఇక బాల భక్తురాలైన 'గొడగూచి' .. తన తండ్రి శివాలయానికి ప్రతిరోజూ తీసుకువెళుతోన్న నైవేద్యాన్ని శివుడే తింటున్నాడని అనుకుంటుంది.

తండ్రిలేని సమయంలో స్వామికి పాలను నైవేద్యంగా పెడుతుంది. ఎంతగా ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో తనభక్తిలో లోపమేదైనా ఉందేమోనని బాధపడుతుంది. ఆయన వచ్చి పాలను తాగేంతవరకూ తాను అక్కడినుంచి కదలనంటూ మారాంచేస్తుంది. దాంతో సదాశివుడు వచ్చి గొడగూచిని బుజ్జగిస్తాడు. గొడగూచి తెచ్చిన పాలను తాగి ఆమెకి సంతోషాన్ని కలిగిస్తాడు. ఇలా మహాదేవుడు భక్తుల ముచ్చట తీరుస్తూ వాళ్లని అనుగ్రహిస్తూ వచ్చిన సంఘటనలు ఎన్నో కనిపిస్తూ వుంటాయి. ఆ స్వామి చల్లని మనసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి.


More Bhakti News