దయగల దేవుడు శివుడేశ్వరుడు
పరమశివుడు పరమదయాస్వరూపుడు. పిలిస్తే పలుకుతాడు ... కొలిస్తే కరిగిపోయి కరుణిస్తాడు. ఆయన పాదాలను ఆశ్రయించిన భక్తులను సంపదలు పలకరిస్తాయి ... శుభాలు చేకూరతాయి. పాపాలు ప్రక్షాళనమై పుణ్యరాశి పెరుగుతుంది. అందువల్లనే సోమవారం వస్తేచాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. భక్తులు స్వామివారిని అభిషేకిస్తూ అనుభూతి చెందుతూ వుంటారు.
అలా భక్తులతో నిత్యనీరాజనాలు అందుకుంటోన్న శివుడు ... 'కూనవరం' లో దర్శనమిస్తూ వుంటాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ... కలువలు పూసిన కొలను ... దాని ఒడ్డునే అందంగా తీర్చిదిద్దబడిన ఈ శివాలయం విలసిల్లుతూ వుంటుంది. సాధారణంగా స్వామివారిని శివుడు ... ఈశ్వరుడు అనే పేర్లతో కొలవడం జరుగుతూ వుంటుంది. ఇక్కడి స్వామి శివుడేశ్వరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుండటం విశేషం.
పార్వతీ సమేతుడైన స్వామివారిని గ్రామస్తులు తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఇక్కడి పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన ఆయురారోగ్యాలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఇదే ప్రాంగణంలో శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా దర్శనమిస్తూ వుంటుంది. స్వామివారి దర్శనంతో సకలసంపదలు చేకూరతాయని చెబుతుంటారు.
ఇక శివకేశవుల కంటే ముందునుంచి ఇక్కడ 'బంగారుపాప' అమ్మవారు కొలువై వుందని స్థలపురాణం చెబుతోంది. అమ్మవారు స్వయంభువు కావడం ఇక్కడి విశేషం. తమ ఇంటి ఆడపిల్లలకు ఈ అమ్మవారి ఆశీస్సులు ... అండదండలు తప్పక ఉండాలనే బలమైన విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ వుంటుంది. ఈ గ్రామానికి చెందిన ఆడపిల్లలు వివాహమై ఏ ఊళ్లోవున్నా ఈ తల్లి ఆమె కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని నమ్ముతుంటారు.
అమ్మవారికి సంతోషాన్ని కలిగించడం కోసం చీరసారెలు సమర్పిస్తూ వుంటారు. ఆమె లీలావిశేషాలను గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. మాఘమాసంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగాను ... మహాశివరాత్రి పర్వదినం సందర్భంగాను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్ర దర్శనంతో పుణ్యఫలాలను అందుకుని తిరిగి వెళుతుంటారు.